గత పాలకులు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని... తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజకీయాల్లో బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు ఉండగా... గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో 44 శాతం సీట్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అట్టడుగు వర్గాల విద్యార్థులకు 20 లక్షల ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని మంత్రి గుర్తు చేశారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర సగర (ఉప్పర) సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సగరుల ఆరాధ్య దైవం అయిన భగీరథ మహర్షి పేరు మీదనే మిషన్ భగీరథ పేరు పెట్టామని... ఈ ఐదేళ్లలో నిరుపేద విద్యార్థుల కోసం 250 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఒకప్పుడు గ్రామాల్లో బావులు, చెరువులు తవ్వడం, ఇళ్ల నిర్మాణాలు చేసే సగరులు ఉపాధి లేక నగరానికి వలస వస్తున్నారని... మళ్లీ వారికి పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: మియాపూర్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి