మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 6 హాట్స్పాట్ కేంద్రాల్లో 100 శాతం కర్ఫ్యూ పాటించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ రెవిన్యూ మీటింగ్ హాల్లో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రెమా రాజేశ్వరితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూరగాయల కోసం సంచార వాహనాలు ఏర్పాటు చేశామని, ఫోన్ చేస్తే సరుకులు ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహబూబ్ నగర్లో నలంద ఆటో స్టాండ్(మర్లు), సద్దల గుండు, రామయ్య బౌలి, షా సాబ్ గుట్ట, బీకే రెడ్డి కాలనీ, కావేరమ్మ పేట ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలు నియంత్రిత జోన్లుగా తేల్చారు.
160 సీసీ కెమెరాలు ఏర్పాటు..
ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలు కాకుండా ఆ ప్రాంతాల్లో అదనంగా మరో 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రజల కదలికలను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు. ఫోన్ నంబర్లకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశామని, బయటి ప్రాంతాలకు వస్తే ఇట్టే గుర్తిస్తామని హెచ్చరించారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. వాహనాలు సీజ్ చేయడం, కేసులు పెట్టడం, ఇతర చర్యలకు వెనకాడబోమని స్పష్టం చేశారు.
దుకాణాలు సీజ్ చేస్తాం..
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే వాళ్లపైనా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. లాక్డౌన్ కొనసాగినా.. మరో మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు, అత్యవసరాలకు ఎలాంటి కొరత లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాస్కులు ధరించకపోయినా, శానిటైజర్లు అందుబాటులో ఉంచకపోయినా దుకాణాలు సీజ్ చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం'