తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి ఫొటో జర్నలిస్టులు ఎంతో కృషిచేశారని పర్యాటక క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జర్నలిస్టుల ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఆయన.. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం(World photography day) సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏ వార్తకైనా, పర్యాటక ప్రదేశానికైనా ఛాయాచిత్రం జీవం పోస్తుందని మంత్రి అన్నారు. ఉద్యమ సమయంలో జర్నలిస్టులు తీసిన చిత్రాలను ఇప్పుడు చూస్తుంటే ఆ పోరాటం కళ్లకు కట్టినట్లు కనపడుతోందని వ్యాఖ్యానించారు.
ఒక్క ఫొటో లక్ష మెదళ్లను కదిలిస్తుంది. ఉద్యమ సమయంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర కీలకం. వారు తీసిన ఫొటోలు ఇప్పుడు చూస్తుంటే ఆనాటి పోరాట దృశ్యాలు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు.
-శ్రీనివాస్ గౌడ్, పర్యాటక శాఖ మంత్రి
పాత్రికేయులకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. కరోనా సమయంలో జర్నలిస్టులను ఆదుకున్నామని చెప్పారు. కొవిడ్ మహమ్మారి వల్ల కార్యక్రమాలు ఎక్కువగా లేకపోవడంతో చాలామంది ఫోటోగ్రాఫర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Kishan Reddy: జన ఆశీర్వాద యాత్రకు ఏర్పాట్లు.. ముందస్తు అరెస్టులు