Minister Niranjan Reddy: ప్రభుత్వ చర్యల మూలంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రభాగాన నిలబడిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా ఎగుమతులు పెరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నాంపల్లి పాఫ్సీ భవన్‌లో "వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు - తెలంగాణ" అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ వీసీ నీరజా ప్రభాకర్, ఫిస్సీ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్, వైస్ ప్రెసిడెంట్ సురేశ్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
మంచి విధానం తెస్తే తొందరలోనే అమలు: వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి ఎగుమతులు పెంచడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఎగుమతులు పెంచడానికి ఏఏ చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపై నిపుణులు, శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందజేయాలని సూచించారు. ప్రపంచ మార్కెట్ ఎగుమతులకు అనుగుణంగా ఎలాంటి నిబంధనలు అనుసరించాలో చైతన్యం చేయాలని చెప్పారు. మనకు అత్యంత ప్రతిభ కలిగిన పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారని.. ఒక మంచి విధానం ముందుకు తెస్తే స్వల్ప సమయంలో అమల్లోకి తెచ్చే సత్తా ఆయనకు ఉందని అన్నారు. ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో అత్యధిక మంది ఇష్టపడుతున్న నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దబడిందని స్పష్టం చేశారు. రాష్ట్ర తలసరి ఆదాయం మునుపటి కంటే పెరిగిందన్నారు.
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారత్: ప్రపంచానికి సాఫ్ట్‌వేర్ సేవలు అందించడంలో భారత్ ముందుందని, ఒక్కరోజు దిగుమతుల్లో అంతరాయం ఏర్పడితే బ్రిటన్ ఆకలితో అల్లాడుతుందని చెప్పారు. బ్రిటన్ ప్రపంచానికి ఏమీ ఎగుమతి చేయడం లేదని.. అన్నింటికి దిగుమతులపై ఆధారపడుతుందని గుర్తు చేశారు.
ఇతర దేశాలతో సంబంధాలు మానవాళికి అవసరం: ప్రపంచంలో 800 కోట్ల జనాభా దాటిపోయిందని.. భారతదేశం అత్యధిక జనాభాతో అగ్రస్థానంలో ఉందన్నారు. మానవాళికి అవసరమైన దైనందిన అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రపంచంలో ఒక దేశం ఇంకో దేశంపై ఆధారపడటం అనివార్యమైందని, వాణిజ్య ఒప్పందాలు లేకుండా దేశాలు మనుగడ సాగించడం అసాధ్యం.. అది లేకుండా జీవితం లేదని వివరించారు. పంటల మార్కెటింగ్ అనేది రైతులకు ఇబ్బందికరంగా మారిందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
- 'సోనియా గాంధీ 'విషకన్య'.. చైనా, పాక్‌కు ఏజెంట్‌గా విధులు!'.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- Mulkamayya Kunta: 'ముల్కమయ్య కుంట'పై రియల్టర్ల కన్ను.. ప్లాట్లుగా మార్చి దందా..!
- Plants Cultivation: పర్యావరణంపై ప్రేమ.. ఇంటిని మొక్కలతో నింపేసిన దంపతులు
- YS Sharmila: రైతులకు భరోసా కల్పించేందుకు షర్మిల జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే