స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలోని హోంలలో ఉన్న బాలికలకు నెలకు రూ.1,000 చొప్పున పోస్టల్ శాఖకు.. తమ మంత్రిత్వ శాఖ తరఫున నిధులు చెల్లిస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. సుకన్య సమృద్ధి పథకంలో భాగంగా ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని డాక్ సదన్‌లో సద్గురు సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహారాజ్ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను మంత్రి సత్యవతి ఆవిష్కరించారు.
![minister sathyavathi rathode, sadguru sevalala maharaj](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10570070_506_10570070_1612949857723.png)
పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుకన్య సమృద్ధి పథకంతో హోంలలో ఉండే నిరుపేద బాలికలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సత్యవతి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, పోస్టల్ శాఖకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గిరిజన ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ పేరిట ప్రత్యేక పోస్టల్ కవర్‌ను విడుదల చేయడం సంతోకరమని అభిప్రాయపడ్డారు. సంత్ సేవాలాల్ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించడానికి చాలా మంది కృషి చేస్తున్నారన్నారు. సేవాలాల్ జయంతిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అధికారికంగా నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు.
ఇదీ చదవండి: కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పింఛన్ ఇవ్వాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి