ఏపీలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి శుక్రవారానికి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా.. అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను అభినందించనున్నట్లు వివరించారు. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అందరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి.. సిబ్బందిని అభినందించాలని కోరారు. గత ఏడాది గాంధీ జయంతి రోజున గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించామని గుర్తు చేశారు.
మరే రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థ లేదని అన్నారు. అవినీతికి తావు లేకుండా అన్ని సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ప్రతి 50 కుటుంబాలకు గ్రామ, వార్డు వాలంటీర్ను అందుబాటులో ఉంచామని వివరించారు. గ్రామ స్వరాజ్యం కోసం ఏపీ సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేశారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం సచివాలయ వ్యవస్థ పనితీరును అభినందించారని మంత్రి చెప్పుకొచ్చారు.
ఇవీచూడండి: రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధం: సీఎం