TSRTC Launched Electric Buses : పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే ఈ బస్సులకు టీఎస్ఆర్టీసీ 'ఈ-గరుడ'గా నామకరణం చేసింది. ఈ బస్సులను హైటెక్ హంగులతో ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చామని, హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకి ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది.
హైదరాబాద్‌లో ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు: రాబోయే రెండేళ్లలో ఆర్టీసీ కొత్తగా 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపింది. వాటిలో 1,300 బస్సులను హైదరాబాద్ సిటీలోనూ.. అలాగే 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని పేర్కొంది. అయితే భాగ్యనగరంలో 10 డబుల్ డెక్కర్ బస్సులను ఇవాళ ప్రారంభానికి సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌లోని ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రారంభోత్సవంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మఖ్య అతిథిగా హాజరయ్యారు.
అందుబాటులోకి వచ్చిన 'ఈ-గరుడ': టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 'ఈ-గరుడ' బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఇవి హైటెక్ హంగులతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు.
TSRTC Launched Electric Buses in Hyderabad : ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయన్నారు. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్, డిసెంబర్ లోపు 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకోస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ బస్సులను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వాటిని మెట్రో స్టేషన్‌కు అనుసంధానం చేస్తామని చెప్పారు.
మొదటిసారిగా హైదరాబాద్-విజయవాడ మధ్య ఇంటర్ సిటీ బస్సులను నడుపుతున్నామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. 10 డబుల్ డెక్కర్, 550 ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకోస్తామని స్పష్టం చేశారు. ఈ బస్సులకు 'ఈ-గరుడ'గా పేరుపెట్టామన్నారు. వీటికి సూర్యాపేట వద్ద 20 నిమిషాల పాటు ఛార్జింగ్ బ్రేక్ ఉంటుంది.
ఇవీ చదవండి: