గడిచిన ఆరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలని గుర్తించి ప్రజలు మళ్లీ తెరాసని ఆశీర్వదించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా గతంలో ఏ ప్రభుత్వాలు ఆదుకొని విధంగా తాము ఆదుకున్నామని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా జీడీమెట్ల, గాజుల రామారం డివిజన్ల పరిధిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విమనవురి కాలనీ ప్రజలు ఏకగ్రీవంగా తెరాసకు మద్దతు తెలిపారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వచ్చే భాజపా, కాంగ్రెస్ నాయకులు... కరోనా, భారీ వరదల సమయంలో ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. కేవలం ఎన్నికల కోసమే వారు ప్రజల దగ్గరకు వస్తున్నారని, వారిని నమ్మి ఓటేస్తే మోసపోవడం ఖాయమని ఆరోపించారు. ఆచరణ సాధ్యంకాని హామీలను నమ్మకుండా పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెరాసకి చైతన్యంతో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
డిసెంబర్ 1న కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భాజపా సర్కారుపై 132 కోట్ల ఛార్జ్షీట్లు వేయాలి: కేటీఆర్