ఆర్టీసీ కార్మికులకు మంచి రోజులు రానున్నాయని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం ఐలాండ్ సెంటర్లో నూతనంగా నిర్మించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బస్ షెల్టర్‌ను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు షేక్ ముస్తాఫా, కిలారి వెంకట రోశయ్యలతో కలిసి ఆయన ప్రారంభించారు.
కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేశాం..
ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను పొరుగు రాష్ట్రాలు అవలంభించాలని ఆలోచిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చరిత్రాత్మకం అని మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. కార్పొరేషన్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేశామన్నారు. పొన్నూరు నుంచి రేపల్లె మీదుగా విశాఖపట్టణానికి, అదేవిధంగా పొన్నూరు నుంచి శ్రీశైలానికి మరో రెండు బస్సులను ఏర్పాటు చేసేందుకు అనుమతులను మంజూరు చేస్తామన్నారు.
దసరాకైనా అనుమతిస్తారో చూద్దాం..
వర్షం పడిన ప్రతిసారి బస్ స్టాండ్ ఆవరణ నీటిమయంగా మారుతోందని స్థానిక శాసనసభ్యుడు.. మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే నిధులు మంజూరు చేసి నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పొన్నూరు నుంచి తిరుపతికి రెండు లగ్జరీ బస్సులను ఆయన ప్రారంభించారు. అనంతరం పొన్నూరు ఆర్టీసీ డిపోలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కార్మిక సంఘాల నుంచి వచ్చిన వినతి పత్రాలను తీసుకున్న ఆయన సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను తెలంగాణలోకి రానివ్వడంలేదన్నారు. దసరా పండుగకైనా బస్సులను అనుమతిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : దూర ప్రయాణాలకు ప్రజా రవాణా లేక ప్రైవేటుదోపిడీ!