niranjan reddy review on inferior seeds : రాష్ట్రంలో నకిలీ విత్తనాలు సరఫరా చేసే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో వానాకాలం సాగు కోసం విత్తనాల అంశంపై మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డీజీపీ అంజనీకుమార్‌తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేంద్రంతో సమన్వయం: ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న వానాకాలం దృష్ట్యా విత్తనాలు, విత్తన నియంత్రణ, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ఈ సమీక్షలో చర్చించారు. వ్యవసాయం బాగుండాలంటే రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలని అన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని రసాయన ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం. ఈ వానా కాలానికి పత్తి, మిరప, కందులు, వరి సహా మిగిలిన అన్ని రకాలు కలిపి 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా వేశామని తెలిపారు.
అమాయకులను బలి చేయొద్దు: పోటీ ప్రపంచంలో విత్తనాల తయారీలో ప్రైవేటు కంపెనీలదే పైచేయిగా ఉంది. వాటిని నియంత్రించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడ్డారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు. గతంతో పోలిస్తే నకిలీ విత్తనాలు దాదాపు కనుమరుగయ్యాయని అన్నారు. ఈ విషయంలో టాస్క్‌ఫోర్స్, వ్యవసాయశాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నకిలీ విత్తనాలను అరికట్టే ప్రయత్నంలో అమాయకులను బలిచేయవద్దని ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
చిన్నచిన్న లోపాలపై కఠినంగా వ్యవహరించవద్దు: ప్రధానంగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్ నుంచి నకిలీ విత్తనాల బెడద అధికంగా ఉందని అధికారులతో చర్చించారు. హెచ్‌టీ పత్తి విత్తనాల విషయంలో రైతులను చైతన్యం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కనిపించే చిన్నచిన్న లోపాలు, తప్పిదాలపై కఠినంగా వ్యవహరించకుండా ట్రేడర్లు, విత్తన వ్యాపారులకు సమయం ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశమివ్వాలని తెలిపారు.
దేశంలో అవసరమైన 60 శాతం విత్తనాలు తెలంగాణ అందిస్తున్న దృష్ట్యా ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని చెప్పారు. వ్యవసాయ రంగం ప్రాధాన్యతను గుర్తించిన సర్కారు 9 ఏళ్లలో ఉచిత కరెంటు, పంటల కొనుగోళ్లు, రైతుబంధు, రైతుభీమా, సాగునీరు, విత్తనాలు, ఎరువుల రాయితీ, యాంత్రీకరణ, పంటల మార్పిడి కోసం రూ. 4.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో పాటు హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్, సీఐడీ చీఫ్ మహేష్ భగవత్ ఇతర ముఖ్య అధికారులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఎఓలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: