రాష్ట్రంలో నకిలీ విత్తనాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ప్రధాన రంగంగా గుర్తించిందని మంత్రి అన్నారు. కంపెనీలు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని... విత్తనాలే నాణ్యతలేకుంటే రైతు తీవ్రంగా నష్టపోతాడని స్పష్టం చేశారు. విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అదనపు డీజీ జితేందర్ ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, సీడ్ టాస్క్ ఫోర్స్ ఐజీ నాగిరెడ్డి ఐజీలు స్టీఫెన్ రవీంద్ర ప్రభాకర్ రావు డీఐజీలు అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పాల్గొన్నారు. రైతులు విత్తనాలు విత్తే సమయంలో నకిలీ విత్తనాలతో నష్టపోకూడదనేది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. పత్తి ప్యాకేట్ గరిష్ట ధర 767రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు.
కేంద్రం 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకేట్ ధరను ఖరారు చేసిందని అంతకుమించి ఎక్కవకు అమ్మవద్దన్నారు. నాణ్యతలేని విత్తనాలను, తిరస్కరించిన వాటిని తిరిగి మళ్లీ వాడాలని ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వానాకాలంలో గ్లైఫోసైట్ అమ్మకాన్ని నిషేధించామని... ఏ దుకాణంలో కనిపించినా లైసెన్స్‌లు రద్దు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని ప్రతి దుకాణంలో సోదాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు, వ్యవసాయ అధికారులకు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే కల్తీ, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై చర్యల కోసం జిల్లా రాష్ట్ర స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి : Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ