మహారాష్ట్రలో బలపడ్డ రైతుల సహకార వ్యవస్థ, సహకార పరిశ్రమలు, వ్యవసాయ విద్య, కృషి విజ్ఞాన కేంద్రాలు లాంటి నూతన ఒరవడులు పవార్ కృషికి ఎల్లప్పుడూ సాక్షిగా నిలుస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా పుణె సమీపంలో బారామతి వద్ద శ్రీసోమేశ్వర రైతు సహకార చక్కెర కర్మాగారాన్ని ఆయన సందర్శించారు. 27 వేల మంది రైతులు సమష్టిగా చెరుకు పండించి... వారే తమ సహకార పరిశ్రమలో చక్కెర, ఇథనాల్, విద్యుత్ తయారు చేసి అధిక లాభాలు ఆర్జిస్తున్నారని కొనియాడారు.
ఆత్మీయ కలయిక
బారామతిలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌ను మర్యాదపూర్వకంగా మంత్రి నిరంజన్ రెడ్డి కలిశారు. శరవేగంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుండడంపై ఆనందం వ్యక్తం చేసిన పవార్... ముఖ్యమంత్రి కేసీఆర్ యోగ క్షేమాలు, ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు, పంటల పరిస్థితిపై ఆరా తీశారు. తెలంగాణ ఏర్పాటుకు తాను, తమ పార్టీ అందించిన సహకారాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. మరింత పురోగమించాలని ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధికి అద్భుతమైన రాజధాని హైదరాబాద్, సాగు నీటి వసతి కలిగిన గ్రామీణ ప్రాంతాలు ఎంతో దోహదపడతాయని పవార్ చెప్పుకొచ్చారు.
రైతుల పాత్ర అద్వితీయం
మహారాష్ట్రలో అభివృద్ధి చెందిన వ్యవసాయానికి శరద్ పవార్‌ను రైతులు ఆద్యుడిగా భావిస్తారని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశంసించారు. సహకార రంగంలో రైతుల పాత్ర అద్వితీయం అని కొనియాడారు. అన్నదాత మూలంగానే వందలాది చక్కెర కర్మాగారాలు విజయవంతంగా సాగుతున్నాయని... ఏటా చెరుకు సాగు పెరిగి రైతులకు లాభాలు తెచ్చి పెడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడి లేకుండా రైతులే సహకార సంఘాలుగా ఏర్పడి అనేక కార్మాగారాలు నడిపిస్తున్నారన్నారు. పంట, పరిశ్రమ, యాజమాన్యం, అమ్మకం, లాభాలు అన్నీ రైతులవే... ఇది సహకార సంఘాలుగా ఏర్పడి విజయం సాధించిన రైతుల గాథ అని కొనియాడారు.
మార్గదర్శకాలు
తెలంగాణలో అధిక ఉత్పత్తి, సమీకృత మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలంటే రైతుబంధు సమితులు క్రియాశీలకంగా వ్యవహరించి రైతులను సంఘటిత శక్తిగా మార్చాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం వాడకం, యంత్ర సామాగ్రి వినియోగం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, రైతుల ఉత్పత్తుల అమ్మకాల్లో ఎక్కడికక్కడ సామూహిక విధానాలను అమలుపరుచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ భేటీ అనంతరం... వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలు, సవాళ్ళు వంటి అంశాలపై చర్చించారు. రైతు అనుకూల పథకాలు, వ్యవసాయ అభివృద్ధికి వినూత్న వ్యవసాయ పద్ధతులపై ఇరువురి అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నామని ట్విట్టర్ వేదికగా పవార్ వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆగి ఉన్న వాహనాల నుంచి డీజిల్ చోరీ.. దొంగల ముఠా అరెస్ట్