అకాల వర్షాలతో తడిసిన, రంగుమారిన ధాన్యం కొంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు అదేశాలు జారీ చేసినట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయం నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో నిరంజన్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని చెప్పారు.
చివరి ఆయకట్టు వరకు ఆఖరు తడికి నీళ్లందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు. వేసవిలో ప్రకృతి వనాల్లోని చెట్లు ఎండకుండా సర్పంచులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రెండు నెలలు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని పెట్టి కాపాడుకోవాలని సూచించారు. ఉపాధిహామీ పనులు వెంటనే ప్రారంభించి కాల్వల పూడిక పనులు ప్రారంభించాలన్నారు. గ్రామాల్లోని పాడుబడ్డ ఇళ్లను ఈ రెండు నెలల్లో గుర్తించి తొలగించి శుభ్రం చేయాలని ఆదేశించారు.
అచ్చంపేట మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలన్న నిరంజన్ రెడ్డి... పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. కరోనా విస్తృతి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: భద్రాద్రిలో వైభవంగా శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు