భాగ్యనగరంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని శాఖలతో కలిసి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఐటి పరిశ్రమ వర్గాలతో మంత్రి ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. వివిధ ఐటీ సంస్థలు, సంఘాల ప్రతినిధులతో పరిమిత స్థాయిలో జరిగిన ఈ భేటీలో ఆయన పలు సూచనలు ఇచ్చారు. కొవిడ్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలపై ఐటీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రస్తుతం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకనుగుణంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని ఐటీ వర్గాలు తెలిపాయి. వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఐటీ ఉద్యోగుల యోగ క్షేమాల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి.. భవిష్యత్ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో నాస్కామ్, హైసియా, సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్లకు చెందిన ప్రతినిధులు, పలు ఐటీ సంస్థల అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ హజరయ్యారు.
ఇదీ చూడండి: కరోనాపై ఐక్యంగా పోరాడదాం.. 'జనతా కర్ఫ్యూ'ను పాటిద్దాం