రాష్ట్రంలో పల్లె ప్రకృతి వనాలు జోరుగా సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది గ్రామాల్లో ప్రకృతివనాలు సిద్దమవుతున్నాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కొన్ని చిత్రాలను షేర్ చేశారు.
కొత్త పంచాయతీరాజ్ చట్టంతో పల్లెల్లో పచ్చదనం పెంపకంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు. పల్లె ప్రకృతివనాలపై ట్వీట్ చేసిన కేటీఆర్కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసిఆర్ నేతృత్వంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన మార్పులతో ఆకు పచ్చ తెలంగాణ ఆవిష్కృతం అవుతోందని అన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఎకరం స్థలంలో ఏర్పాటు చేసే పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాద వాతావరణం ఏర్పడుతోందని దయాకర్ రావు చెప్పారు. వాతావరణ సమతౌల్యానికి పల్లె ప్రకృతి వనాలు దోహదం చేస్తున్నాయని... స్వచ్ఛమైన గాలి, మంచి ఆక్సిజన్ అంది ఆరోగ్య తెలంగాణ సాధ్యం అవుతుందని మంత్రి అన్నారు.
ఇదీ చూడండి: కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు