KTR Tweet on Delimitation of Parliament Seats : భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలు స్వాతంత్య్రం తర్వాత అన్ని రంగాల్లో అత్యుత్తమ పని తీరు కనబరిచాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు క్రమశిక్షణ పాటించాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కేంద్ర తీసుకొస్తున్న జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేటీఆర్ మండిపడ్డారు.
జనాభా విషయంలో పాటించిన క్రమశిక్షణ దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద రాజకీయ శిక్షగా మారనున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కేటీఆర్ కేంద్రంపై పలు విమర్శలు చేశారు. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 33 శాతం కాగా.. పార్లమెంటులో మాత్రం వాటి ప్రాతినిథ్యం కేవలం 20 శాతానికే పరిమితం అయ్యిందని ఆరోపించారు. జాతీయ లక్ష్యాల సాధన పేరిట కేంద్రంలోని గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన జనాభా నియంత్రణ అమలును గాలికొదిలేసిన ఉత్తరాది రాష్ట్రాలు.. ఇప్పుడు పార్లమెంట్‌లో ఆధిపత్యం చెలాయించనున్నాయని అన్నారు.
LokSabha seats delimitation on basis of population: జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాల పునర్విభజన జరిగితే.. ఉత్తర్ప్రదేశ్, బిహార్ వంటి అత్యధిక జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభ సీట్లు కనీవినీ ఎరుగని స్థాయిలో పెరుగుతాయని అన్నారు. ఇన్నాళ్లు జనాభా విషయంలో క్రమశిక్షణ పాటించిన తమిళనాడు, కేరళ, కర్ణాటక మిగిలిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.
delimitation of parliament seats 2026..: ఇది నిజంగా ఒక అవహేళన అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా అన్ని దక్షిణాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా సమష్టిగా తమ గళాన్ని పెంచాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను కేటీఆర్ షేర్ చేశారు. ఇదిలా ఉండగా.. చివరి సారిగా 2011లో అధికారకంగా జనాభా లెక్కలను కేంద్రం విడుదల చేసింది. 2021లో జనాభా గణన చేయాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా ఇది జరగలేదు. తాజాగా జనాభా గణనను అనుసరించి 2026లో పార్లమెంట్ స్థానాల పునర్విభజన చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం మన పార్లమెంట్‌లో లోక్‌సభలో 545సీట్లు ఉండగా.. రాజ్యసభలో 245 స్థానాలు ఉన్నాయి. రెండు సభలలో మొత్తం 790 సీట్లు ఉన్నాయి. 2026 పార్లమెంట్ పునర్విభజన ప్రకారం వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మన దేశంలో గరిష్ఠంగా ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ పార్లమెంట్ సీట్లు ఉండగా.. ఆ తరువాత బీహార్ రెండో స్థానంలో ఉంది. అత్యల్పంగా సిక్కిం, గోవా లాంటి చిన్న రాష్ట్రాలు ఉన్నాయి.
ఇవీ చదవండి: