రాష్ట్రవ్యాప్తంగా తెరాస సభ్యత్వం నేటి వరకు సుమారు 70 లక్షలకు చేరిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు వెల్లడించారు. పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదుకు తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ విధించిన గడువు నిన్నటితో ముగిసినందున.. పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్లో సమీక్ష నిర్వహించారు. సభ్యత్వాల నమోదు కొలిక్కి వచ్చినందున పార్టీ కమిటీల నిర్మాణంపై దృష్టి సారించాలని ప్రధాన కార్యదర్శులకు కేటీఆర్ తెలిపారు.
కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి
ఈనెలాఖరు వరకు తెరాస కమిటీల ఏర్పాటు పూర్తి కావాలన్నారు. క్షేత్ర స్థాయిలో సభ్యత్వ నమోదుకి అద్భుతమైన స్పందన ఉందని కేటీఆర్‌కు తెరాస ప్రధాన కార్యదర్శులు వివరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నప్పటికీ సభ్యత్వాల నమోదు చురుగ్గా కొనసాగుతోందని.. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 50 వేల నుంచి సుమారు లక్ష వరకు సభ్యత్వాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. సభ్యత్వాల రుసుమును పార్టీ కార్యాలయానికి ఎప్పటికప్పుడు డిపాజిట్ చేస్తున్నట్లు వివరించారు.
ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి పరామర్శ
సభ్యత్వాల నమోదు పూర్తి చేసేందుకు మరో వారం, పదిరోజులు సమయం ఇవ్వాలని కేటీఆర్ ను కోరారు. కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదు చేసిన పలువురు ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఫోన్ చేసి అభినందించారు. సభ్యత్వ నమోదు వివరాలను ఎప్పటికప్పుడు డిజిటలీకరణ చేస్తున్నామని.. ఇప్పటికే దాదాపు సగం సభ్యత్వాల కంప్యూటరీకరణ పూర్తయిందని వివరించారు. కరోనా, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న భూపాలపల్లి, నారాయణపేట్, జనగాం ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారు.
నేతలకు దిశానిర్దేశం చేశారు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ సమావేశమయ్యారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానాన్ని కైవసం చేసుకునే వ్యూహాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అనంతరం కరీంనగర్‌కు చెందిన ప్రజాప్రతినిధులతో మంత్రులు విడిగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని 17 నియోజకవర్గాలకు ఇంచార్జిలుగా ఉన్న నేతలతో మంత్రులు పలు అంశాలపై చర్చించారు. వాణీదేవి గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేయాలని అమాత్యులు ఉద్బోధించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి, సుంకే రవిశంకర్, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్ రావు, నారదాసు లక్ష్మణరావు, తెరాస ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: కస్తూర్బా పాఠశాలలో కొవిడ్ కలకలం.. ఏడుగురికి పాజిటివ్