KTR review on Hyd Rains: రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని.. అందుకు సంబంధించి ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు చేపట్టాలని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్.. అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన కార్యక్రమాల పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నగరానికి సంబంధించి ప్రభుత్వం చేపట్టిన వివిధ రహదారి సంబంధిత ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ(హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్), వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక(ఎస్సార్డీపీ).. సంబంధిత కార్యక్రమాల పురోగతిని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.
ట్రాఫిక్ తగ్గింది
నగరంలో ప్రభుత్వం తరఫున చేపట్టిన రహదారి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులపై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయా కార్యక్రమాల ద్వారా నగర పౌరులకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం కలిగిందని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో భవిష్యత్తులో రాబోయే ట్రాఫిక్ సమస్యలను నిర్మూలించేందుకు కూడా వీటి ద్వారా అవకాశం ఉంటుందని కేటీఆర్ అన్నారు. లింక్డ్ రోడ్ల అభివృద్ధి తర్వాత అనేక ప్రాంతాల్లో ప్రధాన రహదార్లపై ట్రాఫిక్ తగ్గిందన్న ఆయన... నూతన ప్రాంతాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడిందని వివరించారు. నాలాల అభివృద్ధి కోసం చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
ఇదీ చదవండి: PM Modi on Samatamurthy: 'జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం'