ఐటీఐఆర్ పథకాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని గురువారం ఆయన దిల్లీలో కలిశారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారని చెప్పారు. ఐటీఐఆర్ పథకాన్ని పునరుద్ధరిస్తే ఈ రంగంలో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతాయన్నారు.
విద్యుత్తు నిల్వకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక సముదాయాలు- దివిటిపల్లిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం దుండిగల్‌లో 450 ఎకరాలు గుర్తించామని, ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు. గ్రామపంచాయతీలకు టి-ఫైబర్‌లో ఇచ్చిన కనెక్షన్లకు గాను ముందుగా చేసుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం భారత్ నెట్ ప్రాజెక్టు-రెండో దశ కింద నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. టి-ఫైబర్ నెట్‌వర్క్‌కు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ నెట్‌వర్క్‌ను బదిలీ చేయాలని కోరారు. పంచాయతీల పరిధిలోని ప్రతి ఆవాసం, వాటిలోని ప్రతి ఇంటికి ఫైబర్ నెట్‌ను అనుసంధానించేందుకు అదనంగా రూ.1200 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: Trs Bhavan in Delhi: మరో కీలక ఘట్టానికి నాంది... దిల్లీలో తెరాస భవనానికి భూమిపూజ