KTR Launch Telangana Cool Roof Policy in Hyderabad : దీర్ఘకాలిక భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకు వస్తున్న కూల్ రూఫ్ విధానం అమలులో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన కూల్ రూఫ్ పాలసీ 2023-28ని హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు.
పర్యావరణాన్ని పరిరక్షించేందుకే ఈ విధానం : భవనాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించటమే కాకుండా,, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ విధానం ఎంతో దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐదేళ్ల పాటు ఈ కూల్‌రూఫ్ పాలసీ అమల్లో ఉండనుందన్న కేటీఆర్.. దీంతోనే ప్రభుత్వ కట్టడాలు నిర్మించనున్నట్లు తెలిపారు. కూల్ రూఫ్ పాలసీ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే కార్యక్రమం అని పేర్కొన్నారు. విద్యుత్ వాహనాల వినియోగం పెరగాలనేది సీఎం కేసీఆర్ ఆశయమని వ్యాఖ్యానించారు. పాలసీ, చట్టం చేయడం చాలా సులువు.. కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టమన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి కూల్ రూఫ్‌కు ఉపయోగిస్తున్నామన్న ఆయన.. వినూత్నమైన ఆలోచనలు ఉంటే భవన నిర్మాణ వ్యాపారులు పంచుకోవాలని కేటీఆర్ సూచించారు.
కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉంది : కూల్ రూఫ్ వల్ల మీటర్‌కు రూ.300 మాత్రమే ఖర్చు అవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రెండు పడక గదుల ఇళ్లపై కూడా కూల్ రూఫ్ ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన.. దీని ఏర్పాటుకు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్నారు. కూల్‌రూఫ్ వల్ల కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉందని అన్నారు. కూల్‌రూఫ్ విధానాన్ని తీసుకొచ్చిన అధికారులకు అభినందనలు తెలిపిన కేటీఆర్.. ఈ విధానం ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా త్వరలో 'మన నగరం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు.
'ఎనర్జీ ఎఫిషియెంట్ పరికరాలు అందరూ వాడాలి. సైకిల్ ట్రాక్‌కు సోలార్ రూఫ్ ఏర్పాటు చేస్తున్నాం. కూల్ రూఫ్ ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు. హైదరాబాద్‌తో పాటు మున్సిపాలిటీల్లో కూల్ రూఫ్ అమలు చేయాలి. త్వరలోనే 'మన నగరం' కార్యక్రమం ప్రారంభిస్తాం. 2030 నాటికి హైదరాబాద్‌లో 200 చ.కి.మీ. కూల్ రూఫ్ చేయాలని లక్ష్యం. మిగతా ప్రాంతాల్లో 100 చ.కి.మీ కూల్ రూఫ్ చేయాలని లక్ష్యం. రాబోయే 50 ఏళ్లలో 5 వేల ఏళ్లలో జరిగిన నగరీకరణ జరగబోతోంది'- కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
ఇవీ చదవండి: