Kothaguda Flyover Inauguration : కొత్త సంవత్సర కానుకగా హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఆ పైవంతెనతో కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి రహదారిలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. రూ.263 కోట్ల వ్యయంతో కొత్తగూడ నుంచి బొటానికల్ గార్డెన్ వరకు ఎస్‌ఆర్‌డీపీ కింద నిర్మించిన ఫ్లైఓవర్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
గచ్చిబౌలి-కొత్తగూడ-కొండాపూర్-హఫీజ్‌పేట రహదారిలో నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఐటీ కార్యాలయాల పనివేళల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉండటంతో 2018 జులై 21న పైవంతెన పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నాలుగేళ్ల పాటు సాగిన నిర్మాణ పనులు పూర్తై ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రానికి కల్పతరువు వంటి హైదరాబాద్‌ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని.. మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఏ నగరంలో జరగనంత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే 50 ఏళ్లకు సరిపడేలా కాళేశ్వరం, సుంకిశాల మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
రాబోయే మూడు నాలుగేళ్లలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి కాలుష్యాన్ని నియంత్రిస్తామని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా మౌలిక వసతులు కల్పిస్తూ విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా ఇప్పటి వరకు కొత్తగూడతో కలిపి 18 ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ రంజిత్ రెడ్డి, శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, శాసనమండలి సభ్యురాలు వాణిదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
'అభివృద్ధి, సంక్షేమం అనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రానికి కల్పతరువు వంటిది హైదరాబాద్ నగరం. అందరికీ ఉపాధి ఇస్తున్నందున ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాం. రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో ప్రాజెక్టులు చేపట్టాం. ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తి చేశాం. మరో 11 ప్రాజెక్టులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు కూడా చేపట్టాం. 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్మిస్తున్నాం.'- కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
ఇవీ చదవండి: