KTR Fires on Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దమ్ముంటే రూ.18 వేల కోట్ల కాంట్రాక్టును వదులుకోవాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు సవాల్ చేశారు. కాంట్రాక్టు వెనక ఎలాంటి మతలబు లేదని యాదాద్రి, భాగ్యలక్ష్మి గుడిలో ప్రమాణం చేయాలన్నారు. కాంట్రాక్టుపై రాజగోపాల్ రెడ్డి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ కోరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మునుగోడు ఉపఎన్నిక సెమీఫైనల్ కాదని.. కేవలం యూనిట్ టెస్టు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఉపఎన్నిక కోసం కాంగ్రెస్, భాజపా ఒక్కటయ్యాయని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశాలకు వెళ్తుండటమే ఇందుకు నిదర్శనమని కేటీఆర్ ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్.. కోవర్టు సోదరులుగా మారారని వ్యాఖ్యానించారు.
మునుగోడు ప్రజలను అంగట్లో సరకుగా కొనొచ్చునన్న మోదీ, ఓ కాంట్రాక్టరు అహంకారం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన రూ.18 వేల కోట్లు మునుగోడు అభివృద్ధి కోసం ఇస్తే ఉపఎన్నిక బరి నుంచి తప్పుకోవడానికి తెరాస సిద్ధమని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో తెరాసకు 105 సీట్లున్నాయని.. ఒకట్రెండు సీట్లతో ఒరిగేదేమీ లేదన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో తెరాస విద్యార్థి విభాగం సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
గుజరాత్ కేమో బోర్డులు.. తెలంగాణకేమో బోడిగుండ్లు..: మునుగోడులో తెరాస గెలిచేందుకు ఫ్లోరైడ్ సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరించిన తీరు చాలని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతుబంధు అత్యధికంగా పొందుతున్న నియోజకవర్గం మునుగోడేనన్నారు. తెరాస పాలనలో ఏ వర్గానికీ అన్యాయం జరగలేదని.. మోదీకి పోజులు కొట్టడం తప్ప ఏమీ రాదన్నారు. తెలంగాణ పరుగులు తీస్తున్న తీరు.. మోదీకి రుచించడం లేదన్నారు. గుజరాత్ కేమో బోర్డులు.. తెలంగాణకేమో బోడిగుండ్లు ఇస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒకప్పుడు చంద్రబాబు, వైఎస్ లాంటి ప్రత్యర్థులు ఉండేవారని.. అప్పుడు ఒక మాట అనాలన్నా, పడాలన్న ఓ పద్ధతిగా ఉండేదని.. ఇప్పుడున్న ప్రత్యర్థులు బఫూన్‌లని వ్యాఖ్యానించారు.
సీతారామన్‌కు ఏమైంది..: బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో లవంగాలు, తంబాకు బుక్కుతూ ఎక్కడ తిరుగుతున్నాడోనని ఎద్దేవా చేశారు. క్షుద్ర విద్యలంటూ బండి సంజయ్ మాట్లాడారని.. కానీ మంత్రి సీతారామన్‌కు ఏమైంది.. ఎందుకలా మాట్లాడారన్నారు. తెలంగాణ కోసం చావడానికి సిద్ధం కానీ.. మోదీ, ఈడీకి భయపడమని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలోనే గుజరాత్‌కు చెందినవారు తెలంగాణలో రాజకీయం చేస్తున్నప్పుడు.. కేసీఆర్ భారాస ఎందుకు పెట్టకూడదు.. ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. దేశానికి గుజరాత్ గోల్‌మాల్ మోడల్ పనికొచ్చినప్పుడు.. తెలంగాణ నమూనా ఎందుకు పనికి రాదన్నారు. భారాస వచ్చినంత మాత్రాన.. తెరాస జెండా, ఎజెండా మారదని.. ప్రజల ఆశీర్వాదం ఉంటే ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అక్రమ కాంట్రాక్టుపై విద్యార్థి విభాగం మునుగోడులో ఊరూవాడా ప్రచారం చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఇవీ చూడండి..
'రాజగోపాల్‌రెడ్డికి కాంట్రాక్టుల రూపంలో ఇచ్చిన సొమ్ము.. మునుగోడు అభివృద్ధికి ఇవ్వాలి'
తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్.. ప్రతిపాదించిన ప్రధాన న్యాయమూర్తి