Minister KTR Fires on Governor Tamilisai Soundararajan : గవర్నర్ మనసుతో ఆలోచించి ఉంటే.. మంత్రి మండలి ఆమోదించి పంపిన ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించేవారు కాదని ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కె. తారకరామారావు(KTR) అన్నారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులనే ఎమ్మెల్సీ(MLC)లుగా కేబినేట్ సిఫార్సు చేసిందని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నవారిని సిఫార్సు చేయవద్దన్న గవర్నర్.. ఆమె గవర్నర్ అవ్వకముందు వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా చేయలేదానని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్.. గవర్నర్ వ్యవస్థ, గవర్నర్ తమిళిసై(Governor Tamilisai), ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
"గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఇప్పటికీ బీజేపీ నేతగానే వ్యవహరించట్లేదా?. తెలంగాణలోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గవర్నర్లు.. మోదీ ఏజెంట్లుగానే వ్యవహరిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక మంది నేతలు ఎమ్మెల్సీలు అయ్యారు. జ్యోతిరాదిత్య సింధియా కూడా ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు కదా. వలస పాలన చిహ్నమైన గవర్నర్ వ్యవస్థను మోదీ ఎందుకు రద్దు చేయరు. ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులో ప్రజలు మాత్రమే తెలుస్తారని" మంత్రి కేటీఆర్ అన్నారు.
KTR Comments on PM Modi : గవర్నర్ పదవికి తమిళిసై అర్హురాలు కారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మోదీ కూడా ప్రధాని పదవిని వైశ్రాయ్‌గా మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణపై పగబట్టాయని ఆవేదన చెందారు. జమిలి ఎన్నికలు రాజకీయ గిమ్మిక్కు మాత్రమేనని అభిప్రాయపడ్డారు. పాలమూరు పచ్చబడుతుంటే బీజేపీ నేతలకు కళ్లు మండుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలని అడిగాం.. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు.
"ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలను మా పార్టీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. దాసోజు శ్రవణ్ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. సత్యనారాయణ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా జాతీయ స్థాయిలో పని చేశారు. ఈ ఇద్దరి నేతలపై గవర్నర్ మనసుతో ఆలోచించి ఉంటే సరైన నిర్ణయం తీసుకునేవారు. అటు మోదీ అప్రజాస్వామికంగానే ఉన్నారు. మోదీ ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉన్న గవర్నర్లు అంతే అప్రజాస్వామికంగా.. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే విధంగా ఉన్నారు." - కేటీఆర్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి
KTR Fires on Congress 6 Guarantees : 'స్కాముల కాంగ్రెస్‌కు స్వాగతం చెబితే.. స్కీములన్నీ ఎత్తేస్తారు'
KTR on Krishna Water Share : కృష్ణా జలాల్లో వాటా తేల్చే తీరిక ప్రధాని మోదీకి లేదానని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో వాటా కోసం సుప్రీంకోర్టుకు వెళ్లామని తెలిపారు. ఈ జలాల వాటా తేల్చకుండా పాలమూరుకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఓట్ల వేట కోసం వస్తున్నారని.. ఇకనైనా మోదీ పాప పరిహారం చేసుకోవాలని సూచించారు. ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్లడం ప్రధానికి అలవాటేనని విమర్శించారు.
ప్రధాని మోదీ ఎందుకు తెలంగాణపై విషం చిమ్ముతున్నారని మంత్రి కేటీఆర్ ఆవేదన చెందారు. మోదీ పదే పదే తెలంగాణ ఏర్పాటును ఎందుకు కించపరుస్తున్నారని ప్రశ్నించారు. 14 ఏళ్లు కేసీఆర్ పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకు పుట్టగతులు ఉండవని ధ్వజమెత్తారు. పాలమూరులో కాలు పెట్టే నైతిక హక్కు ప్రధానికి లేదని తెగేసి చెప్పారు.