కొత్త రాష్ట్రం తన కాళ్ల మీద తాను నిలబడడానికి, నిలదొక్కుకోవడానికి అన్ని రకాల సాయం అందించాల్సిన బాధ్యతను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. ముఖ్యమంత్రి అద్భుతమైన నాయకత్వ పటిమ, దీర్ఘకాలిక దూరదృష్టి వల్ల రాష్ట్రాభివృద్దిలో భాగంగా పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు గుర్తుచేశారు. పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు కేంద్రం అమలు చేయడం లేదని... ఐటీఐఆర్ కారిడార్‌ను రద్దు చేసి తెలంగాణకు అన్యాయం చేశారని మంత్రి ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ వార్షిక సమావేశంలో ప్రసంగించిన కేటీఆర్... వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామని.. అయినా ఫ్యాక్టరీ రాలేదని విమర్శించారు. 'మేక్ ఇన్ ఇండియా' అంటున్న కేంద్రం.. రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రియల్ జోన్ కేటాయించలేదని వివరించారు.
ప్రత్యేక రాయితీల ఊసే లేదు
విభజన చట్టం ప్రకారం తెలుగురాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. అందులో ప్రముఖంగా కొత్తగా వచ్చే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని వాగ్దానం చేసింది. అది నెరవేర్చి ఉంటే రెండు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేవి. ఆరున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీల ఊసే లేకపోగా.. దానిపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన ఇప్పటికీ రాలేదు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల అమలుపై కేంద్రం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గత యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఒడిశాకు ఐటీఐఆర్‌లను ప్రకటించింది. ఆరున్నరేళ్లు గడుస్తున్నా.. ఎన్డీఏ సర్కార్ నిర్ణయం తీసుకోలేదు. -కె.తారకరామారావు, ఐటీ శాఖ మంత్రి
టెక్నాలజీ హబ్‌గా మారింది..
రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో ఐటీ ఎగుమతులు రెండింతలయ్యాయని మంత్రి గణాంకాలతో సహా వివరించారు. దేశానికి టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్ మారిందన్న కేటీఆర్.. ఐటీ, టెక్నాలజీ రంగాలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు.
ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఐటీ ఎగుమతులు రూ. 57 వేల కోట్లు ఉంటే.. కొవిడ్ సంక్షోభ సమయంలోనూ ప్రస్తుతం రూ. 1.40 లక్షల కోట్లకు చేరాయి. ఐదున్నరేళ్లలో దాదాపు రెట్టింపయ్యయాయి. ఏఐ, డాటా అనలటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బాటెక్స్, బ్లాక్‌చైన్, డ్రోన్ మొదలైన సాంకేతికతల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, టాలీవుడ్ కేంద్రంగా ఉండటం వల్ల మెరుగైన వృద్ధి సాధిస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా ఓటీటీ వ్యాపారం జోరందుకోవడం శుభపరిణామం. -కె.తారకరామారావు, ఐటీశాఖ మంత్రి
పరిశోధనలు సాగుతున్నాయి..
కరోనా విపత్తు వేళ పీపీఈ కిట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న దశ నుంచి ప్రస్తుతం ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని సీసీఎంబీ సంచాలకులు రాకేశ్ మిశ్రా వివరించారు. యాంటీ బాడీ టెస్టులు తక్కువ వ్యయంతో అందుబాటులో తెచ్చేలా పరిశోధనలు సాగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రతిభ కనబర్చిన వారికి పురస్కారాలు
నైపుణ్యాభివృద్ధికోసం ప్రభుత్వం సీఐఐతో కలిసి పనిచేస్తుందని కేటీఆర్ తెలిపారు. హరితహారం, కొవిడ్ వారియర్స్, వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి పురస్కారాలు ప్రదానం చేశారు.
ఇదీ చదవండి: ఎన్నికల కోసం కాకుండా.. ప్రజల కోసం పనిచేయండి : కేటీఆర్