KTR Directions On BRS Spiritual Gatherings Tele Conference: సీఎం కేసీఆర్ రాసిన సందేశంతోనే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభం కావాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆత్మీయ సమ్మేళనాల గురించి దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పార్టీ శ్రేణులకు కేటీఆర్ తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపై కమిటి వేస్తున్నామని ఆయన చెప్పారు. మధుసూదనా చారి ఆధ్వర్యంలో పది మందితో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ కమిటీకి పార్టీలోని అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి సమస్యలు లేకుండా అంతా సామరస్యంగా ఈ కమిటీ సూచనలు పాటించి.. ముందుకు సాగిపోవాలని సూచించారు.
KTR BRS Spiritual Gatherings Tele Conference: రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు.. కార్యకర్తలతో బృందాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ వివరించారు. అలాగే సోషల్ మీడియా కమిటీలను బలోపేతం చేసుకునే విధంగా.. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో దిశానిర్దేశం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది ఎన్నిక దృష్ట్యా ప్రజలతో మమేకం అవ్వడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని త్వరితగతిన వాటిపై స్పందించాలని ప్రజా ప్రతినిధులకు సూచనలు చేశారు. అందుకే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను మే నెలాఖరు వరకు చేసుకోవచ్చుని వెల్లడించారు.
100 సీట్లే టార్గెట్: ఈ ఆత్మీయ సమ్మేళనాలు అన్నింటిలో సీఎం కేసీఆర్ రాసి ఇచ్చిన సందేశంతోనే ప్రారంభం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలోని ఉన్న బీఆర్ఎస్ నేతలు అందరూ.. క్యాడర్‌తో సంబంధం లేకుండా ఈ సమ్మేళనాల్లో పాల్గొని.. పార్టీని ప్రతి నియోజకవర్గంలో బలోపేతం చేయాలన్నారు. ఈసారి 100 సీట్లుని టార్గెట్‌గా పెట్టుకుని ఎందుకు ఆ దిశగా అడుగులు ఎలా వేయాలో ఆలోచించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు.. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లవలసిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల పైనా ఉందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలను సమాచార సైనికులుగా తయారు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఇవీ చదవండి: