KTR on NDA: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. అధికార ఎన్డీఏను నో డేటా అవెలబుల్ ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. రైతు చట్టాల రద్దు కోసం అమరులైన రైతు కుటుంబాలకు కేంద్రం తరఫున పరిహారం అందజేస్తారా అని అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంపై కేటీఆర్ ఛలోక్తి విసిరారు. కేంద్రమంత్రి సమాధానమిస్తూ తమ వద్ద అమరులైన రైతులకు సంబంధించిన సమాచారం లేదని లోక్సభలో వెల్లడించారు.
మీ వద్ద ఏ డేటా ఉండదు: కేటీఆర్
KTR ON BJP: కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ నుంచి ఇలాంటి సమాధానం రావడాన్ని మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. చనిపోయిన రైతుల డేటానే కాదు.. కేంద్రం వద్ద కొవిడ్ సమయంలో చనిపోయిన ఆరోగ్య సిబ్బంది డేటా, మూతపడిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల డేటా, చనిపోయిన వలస కార్మికుల డేటా కూడా ఉండదన్నారు. మహమ్మారితో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయుల డేటా, కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ లబ్ధిదారుల డేటా ఇలా ఏదీ మీ వద్ద ఉండదని.. అందుకే ఎన్డీఏ అంటే నో డేటా అవెలబుల్ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
రైతు చట్టాల రద్దు కోసం అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలో లోక్సభలో వ్యవసాయ మంత్రిత్వశాఖను అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రైతు చట్టాలను రద్దు చేస్తూ చట్టం చేశామని.. అంతకు ముందు 11 సార్లు ఈ సమస్యపై రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరిపిందని వ్యవసాయశాఖ సమాధానమిచ్చింది. రైతు ఉద్యమంలో అమరులైన రైతుల డేటా వ్యవసాయ మంత్రిత్వ శాఖ వద్ద లేదని తెలిపింది. రైతుల సంక్షేమం కోసం 22 ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ఇస్తున్నందున అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదని కేంద్ర వ్యవసాయ శాఖ సమాధానమిచ్చింది.
ఇవీ చూడండి: