విద్యాసంస్థలు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో మైనార్టీ, ఎస్సీ గురుకులాల్లోని(Gurukula schools) విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) అధికారులకు సూచించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని గురుకులాలు దేశంలో ప్రఖ్యాతి గాంచాయని మంత్రి అన్నారు. వాటి పేరు, ప్రతిష్ఠలు మరింత ఇనుమడించేలా.. పిల్లలకు బంగారు భవిష్యత్ ఉండేలా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.
పరిశుభ్రత ముఖ్యం..
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులతో అన్నారు. ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, సిబ్బంది అందరికీ టీకాలు వేయించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాలయాల పరిసరాలు, తరగతి, హాస్టల్ గదులు, కిచెన్, బాత్రూంలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. అవసరమైన మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. తరగతి, హాస్టల్ గదుల్లో గాలి, వెలుతురు చక్కగా వచ్చేలా చూడాలని చెప్పారు.
ప్రత్యేక సమావేశాలు..
ప్రవేశాలను త్వరగా పూర్తి చేయడంతో పాటు పాఠ్య పుస్తకాలు, బెడ్ షీట్లు, దుస్తులను సకాలంలో అందించాలని అధికారులకు సూచించారు మంత్రి. విద్యార్థులకు పోషకాహారం అందేలా చూస్తూ.. డైట్ ధరల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. బాలుర డ్రాపౌట్స్ తగ్గించేందుకు డిగ్రీ కళాశాలను ప్రారంభించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. స్థలం, సౌకర్యాలు అందుబాటులో ఉన్న చోట విద్యార్థుల కోసం కోళ్లు, గొర్లు, కూరగాయలను పెంచాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, సిబ్బందికి అవగాహన పెంపొందించాలని సూచించారు.
ఈ సమావేశంలో మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్, ప్రభుత్వ కార్యదర్శులు రాహుల్ బొజ్జ, అహ్మద్ నదీమ్, ఎస్సీ ఎస్టీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: CM KCR: మాంత్రికుడి కథ చెప్పిన ముఖ్యమంత్రి.. వారికి చురకలు