వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వానాకాలం పంటలకు, ఎత్తిపోతల ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్‌పై సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని విద్యుత్ సౌధలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
విద్యుత్ సరఫరాలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ వల్ల జరిగే ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కనెక్షన్ల మంజూరులో నిర్లక్ష్యం తగదని మంత్రి సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో జరుగుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సరఫరాలో అంతరాయం కలగకుండా మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.
పల్లె, పట్టణ ప్రగతిలో పాల్గొనాలి
పల్లె ,పట్టణ ప్రగతి కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విరిగిపోయిన, పాత విద్యుత్ స్తంభాలు తొలగించి కొత్తవి వేయాలన్నారు. వేలాడుతున్న విద్యుత్ వైర్లను వెంటనే పునరుద్ధరించాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయ అవసరాలకు దరఖాస్తు చేసుకున్న వారికి విద్యుత్ కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. వానాకాలంలో విధి నిర్వహణలో విద్యుత్ సిబ్బంది, ఉద్యోగులు, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.