Harish rao review on corona New variant: కొవిడ్ కొత్త వేరియంట్లు, మూడో దశ వస్తే చేయాల్సిన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ప్రజారోగ్య బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. రేపు మరోసారి సమావేశం కానున్నారు. కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కొత్త వేరియంట్ విజృంభణపై కేంద్రం రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. సౌత్ ఆఫ్రికా నుంచి నేరుగా హైదరాబాద్‌కు ఫ్లయిట్స్ లేని కారణంగా ముంబయ్, దిల్లీలో దిగి... హైదరాబాద్ వచ్చే ప్రయాణికుల ట్రేసింగ్, టెస్టింగ్‌కి సంబంధించిన అంశాలపై రేపు చర్చించనున్నారు.
వణికిస్తున్న ఒమిక్రాన్
కరోనా కేసులు తగ్గినప్పటికీ... కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్'(omicron)... ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో.. ఇది మరో ఉద్ధృతికి దారితీయవచ్చన్న ఆందోళనలు రేకెత్తుతున్నాయి. కొద్దిరోజుల కిందట దక్షిణాఫ్రికాలో కనిపించిన 'బి.1.1.529' వేరియంట్ పొరుగుదేశం బోట్స్‌వానాతో పాటు హాంకాంగ్‌కూ వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్, బెల్జియంలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఈ వేరియంట్ సోకుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని.. వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏంటీ కొత్త వేరియంట్?
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ కరోనా వేరియంట్‌ను 'బి.1.1.529'గా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని కారణంగా ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోట్స్‌వానా, ఇజ్రాయెల్, బెల్జియంలోనూ కేసులు వెలుగు చూశాయి.
భారత్‌లో ఆ కేసుల్లేవు: ఇన్సాకాగ్
కొత్త వేరియంట్‌కు సంబంధించి దేశంలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదని ఇండియన్ సార్స్-కొవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకాగ్) వెల్లడించింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది. కొత్త వేరియంట్‌ను పర్యవేక్షిస్తున్నామని, ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించామని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
అత్యంత ఆందోళనకర రకం
కొత్త వేరియంట్‌కు తీవ్రంగా వ్యాపించే లక్షణాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని 'ఆందోళనకర వేరియంట్ (వేరియంట్ ఆఫ్ కన్సర్న్)'గా వర్గీకరించి, 'ఒమిక్రాన్' అని పేరు పెట్టింది. కొద్దిరోజుల కిందటే 'వేరియంట్ అండర్ మానిటరింగ్'గా గుర్తించిన బి.1.1.529పై చర్చించేందుకు శుక్రవారం ఉన్నతాధికారులు, నిపుణులతో డబ్ల్యూహెచ్‌వో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై విస్తృత స్థాయిలో చర్చించి నిర్ణయాన్ని వెల్లడించింది.
ఇదీ చదవండి: 'ఒమిక్రాన్' పై టీకాలు పనిచేస్తాయ్!