Harish rao on Conservation of Rivers: నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణపైనే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో మిషన్ కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్నారని వెల్లడించారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నదుల పరిరక్షణపై జరుగుతున్న జాతీయ సదస్సులో.. రెండోరోజు మంత్రి హరీశ్ పాల్గొన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా నేలపై పడిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి ఆయకట్టు పెంచుకున్నామని హరీశ్ చెప్పారు. ఈ పథకం ద్వారా 46 చెరువులను పునరుద్ధరించుకున్నట్లు వివరించారు.
నదులను కాపాడుకోవాలి
"రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు పడినా ఎక్కడా చెరువులు తెగలేదు. 4వేల చెక్ డ్యామ్‌లను రూ.6 వేల కోట్లతో నిర్మించుకున్నాం. తద్వారా భూగర్భజలాలు పెరిగాయి. ఏడాది పొడవునా చెరువులను వినియోగంలోకి తీసుకొచ్చాం. పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదని సీఎం కేసీఆర్ నిరూపించారు. భవిష్యత్తు తరాల కోసం.. నదులను కాపాడుకోవాలి." -హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి
కేంద్రం అభినందించింది
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమని హరీశ్ అన్నారు. దేశంలో కొన్ని ప్రాజెక్టుల పూర్తికి దాదాపు 20 ఏళ్లు పట్టిందని.. కానీ అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్‌ను మూడున్నరేళ్లలో పూర్తి చేశామని తెలిపారు. తెలంగాణ చేపట్టిన ఎన్నో కార్యక్రమాలను కేంద్రం అభినందించిందని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవనం కోసం ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేపట్టామని వివరించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. 2014 తో పోల్చితే 2021 లో రెట్టింపైందని వెల్లడించారు.
ఇదీ చదవండి: 'తెలంగాణకు కేసీఆర్ బంధు అయితే.. రేవంత్ తాలిబన్'