Minister Harish Rao Review: నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపటం సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మోకాలు, తుంటి ఎముకల మార్పిడి శస్త్రచికిత్సలను పెంచాలని మంత్రి హరీశ్ రావు వైద్యులకు స్పష్టం చేశారు. నిలోఫర్, గాంధీ ఆస్పత్రుల సూపరిండెంట్లు, అన్ని విభాగాల అధిపతులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభాగాల వారీగా పనితీరును సమీక్షించిన మంత్రి... గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలు, పురోగతిపై ఆరా తీశారు.
ఈ ఏడాది వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన బడ్జెట్లో 1100 కోట్లు ఆస్పత్రుల నిర్వహణకు, మందుల కొనుగోళ్లకు 500 కోట్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం మరో 300 కోట్లు, వైద్య పరికరాల కోసం 500 కోట్లు, సర్జికల్ అవసరాలకు 200 కోట్లు కేటాయించామన్నారు. దీంతో పాటు డైట్ ఛార్జీల కోసం 43.5 కోట్లు కేటాయించుకున్నట్టు తెలిపారు. సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలను నలభై నుంచి ఎనభై రూపాయలకు, టీబీ, క్యాన్సర్ రోగులకు ఇచ్చే డైట్ ఖర్చుని 112కు పెంచినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అధికారులకు పూర్తి సహకారం అందుతోందన్న ఆయన... ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
గాంధీలో మోకాలు, తుంటి ఎముకల మార్పిడి సర్జరీలతో పాటు ఇతర అవయవ మార్పిడి సర్జరీలు పెరగాలన్న మంత్రి.. సంతానోత్పత్తి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ విభాగాల వారీగా జిల్లాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకి వైద్య సేవలు చేరువ చేయాలనీ గాంధీ వైద్యులకు సూచించారు. నిలోఫర్ ఆసుపత్రిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు తీసుకునేందుకు వీలుగా బాక్స్‌లు ఏర్పాటు చేయాలన్నారు. నిలోఫర్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న 800 పడకల బ్లాక్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: TRS protests: ధాన్యం కొనేవరకు పోరాటం ఆగదు.: కేంద్రంతో పోరులో తెరాస నేతలు