హైదరాబాద్ పెట్టుబడులకు అత్యంత అనువైన నగరంగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు(harish rao) పేర్కొన్నారు. సింగపూర్ ప్రతినిధులతో జరిగిన మర్యాదపూర్వక భేటీలో రాష్ట్ర స్థితిగతులు, నగరం గురించి సింగపూర్ ప్రతినిధులకు మంత్రి వివరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తోందని తెలిపారు. ఇవాళ సింగపూర్ హైకమిషనర్ హెచ్.ఇ.సైమన్ వాంగ్ (singapore high commissioner HE Simon wang) నేతృత్వంలోని ఆ దేశ ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో మంత్రిని కలిసింది. నగరంలో డేటాసెంటర్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పోరేట్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ తెలిపారు.
డేటా సెంటర్లకు అత్యంత అనుకూలం
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో దూసుకెళ్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. డేటా సెంటర్లకు హైదరాబాద్ అత్యంత అనువైనదని... ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు తమ కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేశాయని మంత్రి వారికి వివరించారు. సౌరవిద్యుత్ వంటి రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రం అనువైందని... ఏడాది పొడవునా సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలతో ఫార్మా సిటినీ ఏర్పాటు చేస్తోందన్న ఆయన... రాష్ట్రం వ్యాక్సిన్ హబ్‌గా మారిందని అన్నారు. మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యుత్, రహదారులు, విమానాశ్రయం, శాంతిభద్రతల విషయంలో హైదరాబాద్ సురక్షితమైన నగరమని తెలిపారు.
కాళేశ్వరంపై సింగపూర్ ప్రతినిధుల ఆరా
కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై విదేశీ ప్రతినిధులు ఆసక్తిగా మంత్రి హరీశ్ రావును అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను 630 మీటర్ల ఎత్తుకు తరలిస్తున్నట్లు మంత్రి వారికి వివరించారు. ఏడున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారని... ప్రభుత్వ చర్యలతో రైతుల ఆత్మహత్యలు పూర్తి స్థాయిలో తగ్గాయని పేర్కొన్నారు. కేవలం పట్టణాలు, నగరాలే కాకుండా పల్లెల్లోనూ సమూలంగా మార్పులు తీసుకొచ్చామన్న హరీష్ రావు... మంచి రహదార్లు, చెత్త సేకరణ, డంప్ యార్టుల వంటి వసతులను అన్ని గ్రామాల్లో కల్పించినట్లు వివరించారు. హరితహారంతో ఏడేళ్లలో రెండు శాతం పచ్చదనం పెరిగిందని అన్నారు. తదుపరి పర్యటనలో పల్లెలను సందర్శించి అక్కడున్న మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని పరిశీలించాలని హరీశ్ రావు సింగపూర్ ప్రతినిధి బృందానికి సూచించారు. కోరారు. సిద్దిపేట జిల్లాను కూడా సందర్శించాలని మంత్రి కోరారు.
ఇవీ చూడండి:
Harish Rao: త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: హరీశ్ రావు
Job recruitment: ఉద్యోగాల ఖాళీలపై అధికారులతో హరీశ్ రావు భేటీ