Minister Harish Rao Review On Health City: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. దసరా నాటికి ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధితోపాటు, నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలను సైతం వేగవంతం చేయాలన్నారు.
వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీ పనులు పురోగతి.. ఇతర అంశాలపై మంత్రి హరీశ్‌రావు ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ, సంక్షేమ విభాకం కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహచ్ శ్రీనివాస్‌రావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చనున్నట్లు తెలిపారు.
దిల్లీ ఎయిమ్స్ తరహాలో సేవలు: మాడ్యూలర్ థియేటర్లు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశమే లేకుండా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలన్నారు. దిల్లీ ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్న మంత్రి.. ఆసుపత్రుల పనులను వేగంగా పూర్తి చేసి.. త్వరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. మరోవైపు 8 టీచింగ్ ఆసుపత్రుల నిర్మాణ పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
34 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు: 59 ఎకరాల్లో విశాలంగా నిర్మిస్తున్న ఈ ఆసుపత్రిలో గుండె ఇతర అవయావాల మార్పిడి, యూరాలజీ నెఫ్రాలజీ తరితర 34 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు రోగులకు అందనున్నాయి. ఇంకా ఇక్కడ సువిశాలమైన ఆడిటోరియం, 1399 జనరల్ వార్డు పడకలు, 300 ఐసీయూ పడకలు, 25 కీమో థెరెఫీ పడకలు ఇలా మొత్తం 2,000 పడకలతో పాటు.. వైద్యుల కోసం ప్రత్యేకంగా గదులు, వైద్య విద్యార్థులకు సెమినార్ హాళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
విశాలమైన పార్కింగ్, పచ్చదనం పెంచేలా ఆసుపత్రి ముందు అందమైన ఉద్యానవనం ఇలా అనేక ప్రత్యేకతలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సర్వాంగ సుందరంగా నిర్మితం కానుంది. వరంగల్‌లో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తైతే.. నగర పరిసర ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. రోగులకూ కూడా వైద్యం కోసం హైదరాబాద్ దాకా వెళ్లే బాధలు తప్పుతాయి.
ఇవీ చదవండి: