ఈ నెల 8వ తేదీన నిర్వహించే చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న పనులను మంత్రి తలసాని, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్, మేయర్ బొంతు రామ్మోహన్, బత్తిన సోదరులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాల రికార్డింగ్ పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
పక్కాగా ఏర్పాట్లు
చేప ప్రసాదం కోసం పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తారని మంత్రి తలసాని తెలిపారు. ఐదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈసారి కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు గల వారికి, దివ్యాంగులకు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణ కోసం మూడు ఫైరింజన్లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : విద్యావ్యవస్థను క్రమబద్ధీకరించండి: సుప్రీం