కొవిడ్ ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. శానిటేషన్ సిబ్బంది కొరత ఉన్నందున ఆస్పత్రులను శుభ్రపరిచేందుకు ఆధునిక పరికరాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. ఫ్లోర్ వాల్, బాత్రూమ్ క్లీనింగ్ కోసం ఆధునిక పరికరాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని వాటిని త్వరలో కొనుగోలు చేస్తామన్నారు.
10 మంది చేసే పని ఒకే యంత్రం చేస్తుందన్న ఆయన... తక్కువ సమయంలో నాణ్యమైన పని చేసే యంత్రాలు కొనుగోలు చేయలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల వ్యర్థాలను తరలించేందుకు సైతం ప్రత్యేక యంత్రాలను అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మెడివేస్ట్‌లో ఎక్కువగా వైరస్ ఉండే ప్రమాదం ఉన్నందున వ్యర్థాలను తరలించేందుకు మననుషులతో పోలిస్తే యంత్రాలు మేలని మంత్రి అభిప్రాయపడ్డారు.
కొవిడ్ రోగులకు వేడి ఆహారాన్ని అందించేందుకుగాను... హాట్ ప్యాక్‌లను వాడాలని ఆధికారులకు ఈటల సూచించారు. ఫలితంగా పరిశుభ్రమైన వాతావరణంతో పాటు మంచి ఆహారాన్ని అందించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..