ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద మంజూరు చేసే రహదార్ల విషయంలో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని కొత్త రహదార్లు మంజూరు చేయాలన్నారు. పీఎంజీఎస్వై, ఈమార్గ్ లపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ హైదరాబాద్‌లో ప్రాంతీయ శిక్షణ, సమీక్ష కార్యక్రమం నిర్వహించింది. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... పీఎంజీఎస్ మూడో దశ కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2,427కిలో మీటర్ల రహదారులు మంజూరు చేసిందని... దీన్ని నాలుగు వేల కిలో మీటర్లకు తగ్గకుండా చూడాలని కోరారు. రాష్ట్రంలోని ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని 90 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అదనంగా 20 కిలో మీటర్ల చొప్పున రహదార్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 32 గ్రామీణ జిల్లాల్లో పీఎంజీఎస్వై కింద చేపట్టే పనులకు సైతం కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర వాటా 10 శాతంగా నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్ర ప్రభుత్వ అధికారి అల్కా ఉపాధ్యాయకు లేఖ అందించారు.
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ పొరపాటు కారణంగా తారు రోడ్డు ఉన్నట్లుగా నమోదైన వాటిలో మరో 534 ఆవాసాలకు తారురోడ్లు వేయాల్సి ఉందని లేఖలో మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. పీఎంజీఎస్ మూడో దశలో దాన్ని సవరించి కొత్తగా మంజూరు ఇచ్చే సమయంలో పరిశీలించి 534 ఆవాసాలకు రహదార్లు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రధాని మోదీ దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లినట్లు తెలిపారు. సమీక్షలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ జనరల్ అల్కా ఉపాధ్యాయ, డైరెక్టర్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'కాషాయం'పై క్లారిటీ ఇచ్చిన సూపర్‌స్టార్