నాలుగో దఫా పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతమైందని.. పదిరోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభించిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు పారిశుద్ధ్యం, పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు.. ఇప్పటికే చేపట్టిన పనులు పూర్తయ్యేలా వాటిపై దృష్టి సారించినట్లు చెప్పారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకూడదనే ఉద్దేశంతో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడించారు.
రాజకీయాలకు అతీతంగా
నాలుగో విడతలో భాగంగా 12,769 గ్రామపంచాయతీల్లో నిర్వహించిన గ్రామసభల్లో ప్రజలు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారని పేర్కొన్నారు. జులై 1 నుంచి 6.56 లక్షల రహదార్ల శుభ్రత, 3.51 లక్షల మురుగు కాలువల్లో పూడిక తీయించినట్లు వివరించారు. 50 వేలకు పైగా లోతట్టు ప్రాంతాల్లో నీటినిల్వకు అవకాశం లేకుండా పూడ్చినట్లు మంత్రి తెలిపారు. హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటామన్న మంత్రి.. గ్రామాల్లో ఒక్కో ఇంటికి ఆరు చొప్పున 7.83 కోట్ల మొక్కలు పంపిణీ చేసినట్లు వివరించారు. గతంలో నాటి చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా 70.64 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా తుప్పుపట్టిన పాత కరెంటు స్తంభాల స్థానంలో కొత్తగా 25 వేలకు పైగా స్తంభాలు మార్చినట్లు మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు పల్లెప్రగతి కింద 2019 సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు రూ. 6,500 కోట్లు గ్రామీణ, స్థానిక సంస్థలకు మంజూరు చేసినట్లు వివరించారు. నాలుగు విడతల పల్లెప్రగతితో గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని దయాకర్ రావు తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని రూపొందించి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. నాలుగో దఫాలో తాను 14 జిల్లాల్లో పర్యటించడమే గాక పల్లెనిద్ర చేశానని పేర్కొన్నారు. ఈ విడతలో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇదీ చదవండి: Palle pragathi: ముగిసిన నాలుగో విడత.. అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి ఆరా.!