ఎన్నికల కోసం ఎంఐఎం అసత్యపు ఆరోపణలు చేయబోదని... తాము చేసిన పనులు వివరించి ఓట్లు అడుగుతామని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించి తాము చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఎన్నికలు రాగానే ప్రజలను మభ్యపెట్టి ఓట్లు అడిగే సంస్కారం తమకు లేదని... గత 62 ఏళ్లలో ఎప్పుడు కూడా ఎన్నికల మేనిఫెస్టోలను తాము విడుదల చేయలేదని ఆయన పేర్కొన్నారు.
పార్టీ ఆవిర్భావం సందర్భంగా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. మైనార్టీల ఆర్థిక, విద్య, వైద్య అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చామని... దానికి అనుగుణంగానే తాము పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభ్యర్థిని గుర్తు పెట్టుకోవాలంటే ఉద్వేగపూరిత ప్రసంగాలే చేయవల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా సమయంలో, వరదలొచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకొని తమ అభ్యర్థులను గెలిపించాలని అక్బరుద్దీన్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి : తెరాస మేనిఫెస్టోలో ఈ హామీలే ఉండనున్నాయా!