ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లు రెండు వేర్వేరంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తప్పుదోవ పట్టిస్తున్నారని మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ముస్లిం ఐక్య కార్యాచరణ సమితి నాయకులతో కలిసి అసద్... సీఎం కేసీఆర్తో సుమారు 3 గంటలపాటు సమావేశమయ్యారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్పీఆర్ను వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో హోంమంత్రి మహమూద్ అలీ, మజ్లిస్ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్, ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, పలువురు ముస్లిం మత పెద్దలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
కేరళ తరహాలో తెలంగాణలోనూ
కేరళ తరహాలో తెలంగాణలోనూ వీటిని అమలు చేయవద్దని కేసీఆర్‌ను కోరామని అసద్ చెప్పారు. రెండు రోజుల్లో తమ పార్టీ వైఖరి చెబుతామని సీఎం తెలిపారన్నారు. ఇది కేవలం ముస్లింల సమస్య మాత్రమే కాదు. దేశం, రాజ్యాంగానికి సంబంధించిన సమస్య అని... మత ప్రాతిపదికనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు.
పౌరసత్వాన్ని నిర్ధారించేవారెవరు?
ఎన్‌పీఆర్ వల్ల దేశ పౌరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్రం చెబుతోందని... జనాభా లెక్కలకు, ఎన్‌పీఆర్ లెక్కలకు తేడా ఉందన్నారు. జనాభా లెక్కల్లో.. పుట్టిన ప్రదేశం, తల్లిదండ్రుల వివరాలు అడగరని... ఎన్‌పీఆర్‌లో పౌరసత్వ వివరాలు అడుగుతారని చెప్పారు. తెలంగాణలో 29 శాతం మందికి మాత్రమే జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం
''కలిసి వచ్చే పార్టీలతో దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తాం. ఈ నెల 27న నిజామాబాద్‌లో సభ నిర్వహిస్తున్నాం. అందులో తెరాస కూడా పాల్గొనాలని ఆ పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్‌ను కోరాం. ఆయన అంగీకరించారు. ఇందులో పాల్గొనాలని తెరాస మంత్రులకు మా ముందే చెప్పారు. మిగిలిన పార్టీలనూ పిలవాలని సీఎం సూచించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీలను ఆహ్వానిస్తాం’’ అని అసద్ తెలిపారు.
ఇవీ చూడండి: 'విలువలు మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయి'