ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలోని డి.కొట్టాల గ్రామంలో స్వచ్ఛమైన పాలు కిలో రూ.33కు పాడి రైతులు విక్రయిస్తున్నారు. సాధారణంగా పాలను లీటర్లలో కొలిచి విక్రయిస్తారు, కొనుగోలు చేస్తారు. కానీ డి.కొట్టాల గ్రామంలో మాత్రం పాడి రైతులందరూ కిలోల్లోనే అమ్ముకుంటున్నారు. నంద్యాల నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి పాలను కిలోల్లో కొనుగోలు చేస్తున్నారన్నారు. గ్రామంలో పాల డెయిరీ లేకపోవడంతో కిలోల్లో విక్రయించాల్సి వస్తోందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని డెయిరీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
"నేను రోజూ ఉదయం, సాయంత్రం రెండు కిలోల పాలను విక్రయిస్తాను. రెండు కిలోల పాలకు రూ.66 మాత్రమే వస్తోంది. ఒక బర్రెకు నెలకు 50 కిలోల తవుడు పెడుతున్నాను, తవుడు ఖరీదు రూ.1300 పలుకుతోంది. దీంతో పాలు విక్రయిస్తే వచ్చే ఆదాయం అంత బర్రె తవుడుకే సరిపోతుంది".
-పాడి రైతు ఉస్సేనమ్మ, డి.కొట్టాల.