సికింద్రాబాద్ బొల్లారంలో శిక్షణ పూర్తి చేసుకున్న సైనిక అధికారుల కవాతు ప్రదర్శన ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన 24 మంది అభ్యర్థులు ఈ ప్రదర్శన నిర్వహించారు. మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ (ఎంసీఈఎంఈ)లో జరిగిన ఈ కార్యక్రమంలో పరిమిత సంఖ్యలో సైనిక అధికారులు హాజరయ్యారు.
ఆకట్టుకున్న కవాతు
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కవాతు ప్రదర్శన నిర్వహించిన అభ్యర్థులు భౌతిక దూరం పాటించి... ప్రతి ఒక్కరు మాస్కు ధరించారు. సంవత్సర కాలం శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తదుపరి మరో మూడు సంవత్సరాలు ఇంజినీరింగ్ కోర్సు కొనసాగిస్తారు. అనంతరం విధుల్లో చేరుతారు.
సవాళ్లను అధిగమించాలి
సైనిక అధికారుల నుంచి ఎంసీఈఎంఈ కమాండెంట్ నారాయణన్ గౌరవ వందనం స్వీకరించారు. ఎంసీఈఎంఈలో వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు తెలిపారు. ఎవరికైనా లక్షణాలు ఉంటేనే కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు కళాశాల ప్రాంగణంలో ఎవరికీ వైరస్ లక్షణాలు లేవని ఆయన చెప్పారు. జాతీయ భద్రతలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞనాన్ని అందిపుచ్చుకుంటూ... విధి నిర్వాహణలో ముందుకు సాగాలని నారాయణన్ కోరారు.
దేశసేవలో
ఎంసీఈఎంఈలో శిక్షణ పొందడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. సవాళ్లను ధీటుగా ఎదుర్కొని దేశ సేవలో ముందుంటామని చెప్పుకొచ్చారు. సైనిక అధికారులు నిర్వహించిన కవాతు ప్రదర్శన ఆకర్షణీయంగా సాగింది.
ఇవీ చూడండి: కరోనా మందు తయారీకి రెడ్డీస్ ల్యాబ్స్ కీలక ఒప్పందం