చేద్దామంటే కొలువు లేదు.. ఉండాలంటే నెలవు లేదు.. పోదామంటే తోవ లేదు.. కనీస సదుపాయాలకు వారు దూరం. కష్టాలకు బాగా దగ్గర. కరోనా కట్టడి కూలీలకు పిడుగుపాటు. ప్రపంచ కార్మిక దినోత్సవం వేళ.. ఊరు కాని ఊరిలో, తమవి కాని ఇరుకిళ్లలో.. కుటుంబాలకు దూరంగా.. బతుకు భారంగా గడిపేస్తున్న వలసజీవులు వీరు. హైదరాబాద్ నానక్‌రాంగూడలోని రేకులషెడ్లలో మగ్గిపోతున్నారు. అసలే వేసవి మంట. ఆపై ఆకలి తంటా. కరోనా నివారణకు దూరం పాటించాలన్నా ఇలాంటి ఇరుకు గదుల్లో ఎలా సాధ్యం?
ఒక్కో గదిలో పదేసి మంది నివాసం..
కరోనా వ్యాప్తి నివారణకు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌లో ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వలస కూలీలు చిక్కుకుపోయారు. వారిని స్వస్థలాలకు పంపించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈలోగా చాలామంది కాలినడకన బయలుదేరారు. కొందరు రోజుల తరబడి నడిచి తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. మరికొందర్ని జాతీయ రహదారిపై వెళ్తుండగా వెనక్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇరుకు గదుల్లో కనీసం పది మందికిపైగా ఉంటున్నారు. వ్యక్తిగత దూరం లేదు. మౌలిక వసతుల్లేవు. గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఖాజాగూడ ప్రాంతాల్లో వారు ఉంటున్న రేకుల షెడ్ల వద్ద కాలకృత్యాలకు కూడా సౌకర్యాలు లేవు.
ఎండవేడికి అల్లాడుతున్న చిన్నారులు..
నగరంతో పాటు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో కొద్దిరోజులుగా 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలు, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చినవారు గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఖాజాగూడ, వనస్థలిపురం, ముసారంబాగ్, తిలక్‌నగర్ ప్రాంతాల్లో వలస కూలీల నివాసాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. రేకులు, టార్పాలిన్లు, ఫ్లెక్సీలతో కూడిన ఆవాసాలు కావడం వల్ల చిన్నారులు ఎండ వేడికి అల్లాడుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఖాళీగా ఉన్న కళాశాలలు, విద్యాసంస్థలకు చెందిన భవనాల్లోకి రేకులషెడ్లలో ఉంటున్న వారిని తరలించాలని ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.
బాలామృతం, కోడిగుడ్లు అందించాలని కోరుతున్న తల్లులు..
ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ బతికే వలస జీవుల బిడ్డలు కొందరు అర్ధాకలితో అలమటిస్తున్నారు. పౌష్టికాహారమూ అందకపోవడం వల్ల అవస్థ పడుతున్నారు. లాక్‌డౌన్ వేళ చేతిలో నగదు లేక వీరి కష్టాలు రెట్టింపయ్యాయి. సంగారెడ్డి రాజధానికి సమీపంలో ఉండటం వల్ల నిర్మాణ రంగమూ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా జిల్లాలోని పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధిలో ఇటుక బట్టీలూ అధిక సంఖ్యలో ఉన్నాయి.
వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు ఇక్కడికి వచ్చి పనిచేస్తుంటారు. కంది మండలం చిమ్నాపూర్ తండా సమీపంలోని బట్టీల వద్ద దాదాపు 400కు పైగా కుటుంబాలున్నాయి. ఇక్కడ ఆరేళ్ల లోపు చిన్నారులు దాదాపు 80 మంది వరకు ఉంటారు. నెల రోజుల క్రితమే అంగన్వాడీ కార్యకర్త వచ్చి వీరి నుంచి సమాచారాన్ని తీసుకెళ్లారు. బాలామృతం, కోడిగుడ్లు ఇస్తున్నామన్నారు. లాక్‌డౌన్ విధించి నెల గడిచిపోయినా ఇవి చేరలేదు.
ఇదీ చూడండి: ప్రపంచంపై ఆగని కరోనా ప్రతాపం-రష్యాలో లక్ష కేసులు