చేయడానికి పని లేక.. తనడానికి తిండిలేక నానా అవస్థలు పడ్డ వలసకూలీలు ఎట్టకేలకు సొంతూళ్లకు వెళ్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ చొరవతో దేశంలో మొట్టమొదటి ప్రయాణికుల ప్రత్యేక రైలు హైదరాబాద్‌లోని లింగంపల్లి స్టేషన్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున బయల్దేరి ఝార్ఖండ్‌లోని హతియాకు వెళ్లింది. 1,225 మంది ప్రయాణికులు బోగీల్లోకి ఎక్కగానే..అధికారులు చప్పట్లు కొడుతూ వారిని సాగనంపారు. తెలంగాణ ప్రభుత్వ వినతి మేరకు హతియాకు ప్రత్యేక రైలు నడిపామని..ఈ రైలు ఛార్జీల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుందని ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు.
శ్రామిక్ స్పెషల్స్
ప్రతి ఒక్క టికెట్‌కు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రూ.50, సూపర్‌ఫాస్ట్‌రైళ్లలో రూ.20 అదనంగా వసూలు చేయాలని రైల్వేబోర్డు ఆదేశించింది. ఈ రైళ్లకు ‘శ్రామిక్ స్పెషల్స్’ అని పేరుపెట్టారు.లాక్‌డౌన్ కారణంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నిలిచిపోయిన వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులను రోడ్డుమార్గంలో స్వస్థలాలకు పంపడానికి 29న కేంద్ర హోంశాఖ అనుమతిచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు నోడల్ అధికారుల్ని నియమించింది. రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు ప్రత్యేక రైళ్లు నడిపేందుకు కేంద్రం అనుమతిచ్చింది.
తొలిదశగా ప్రాథమిక వైద్యపరీక్షలు
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 2,464 మంది కార్మికులు ఏప్రిల్ 29న జీతం ఇప్పించాలని, స్వరాష్ట్రాలకు తరలించాలని ఆందోళన చేసిన విషయం విదితమే. ఐజీ స్టీఫెన్ రవీంద్ర రెండురోజులు కందిలో ఉండి.. కూలీలతో మాట్లాడారు. గురువారం రాత్రి 10.30 తర్వాత సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి కార్మికుల దగ్గరకు వెళ్లారు. అప్పటికే వీరి సూచన మేరకు 66 బస్సులు కావాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఆదేశించడంతో అధికారులు డ్రైవర్లు, బస్సులను సిద్ధం చేశారు. రాత్రి 12 గంటలకు బస్సులు ఐఐటీ ప్రాంగణానికి వచ్చాయి. తొలిదశగా ప్రాథమిక వైద్యపరీక్షలు పూర్తయిన ఝార్ఖండ్‌కి చెందిన 1,225 మందిని శానిటైజేషన్ చేసిన 56 బస్సుల్లో లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు తరలించారు. కూలీలు దూరం పాటిస్తూ రైలెక్కారు. ఈ రైలు శుక్రవారం ఉదయం 4.50 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరి రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానమైన హతియాకు చేరుకుంది.
ఒక్కో బోగీలో 54 మంది మాత్రమే
ప్రత్యేక రైల్లో 22 బోగీలున్నాయి. 18 స్లీపర్, 4 జనరల్ బోగీలు. స్లీపర్‌లో ఒక్కో బోగీలో 72 బెర్తులుంటాయి. ప్రయాణికుల మధ్య వ్యక్తిగత దూరం కోసం మధ్య బెర్తులు తొలగించారు. ఒక్కో బోగీలో 54 మందినే అనుమతించారు. స్టేషన్‌లోనే వీరికి టికెట్లు ఇచ్చారు. లింగంపల్లి స్టేషన్‌లో ఆహారం, నీళ్లు ఇచ్చి పంపారు. మహారాష్ట్రలోని బల్లార్షాలోనూ వీరికి ఆహారం అందించినట్లు సమాచారం. నోడల్ అధికారి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రోనాల్డ్‌రోస్‌తో పాటు సంగారెడ్డి జిల్లా యంత్రాంగం వారిని రైలు ఎక్కించి వీడ్కోలు పలికారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: దేశవ్యాప్తంగా 35వేలు దాటిన కరోనా కేసులు