లాక్‌డౌన్‌లో ప్రజలు తమ ఇబ్బందులను నేరుగా పోలీసులకు తెలియజేసేలా ‘సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ రూం’కు సీపీ సజ్జనార్ శ్రీకారం చుట్టారు. 24 గంటలు పనిచేసేలా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పర్యవేక్షణను డీసీపీ, ఏడీసీపీకి అప్పగించారు. మార్చి 22నుంచి ఇప్పటివరకు ఎన్ని కాల్స్ వచ్చాయి.. ఎక్కువగా ఎలాంటి తరహా ఫిర్యాదులొచ్చాయో లెక్కలు తీశారు. 1.1 లక్షల ఫోన్ కాల్స్ వచ్చినట్లు గుర్తించారు.
గతంతో పోలిస్తే కాల్స్ సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. లాక్‌డౌన్ ప్రారంభంలో ప్రతిరోజు 2వేల నుంచి 3వేల వరకు వచ్చాయి. ఏప్రిల్ చివరి వారం నుంచి ఆ సంఖ్య 1200కు తగ్గగా.. ఇప్పుడు 450 నుంచి 500 వరకు వస్తున్నట్లు తేల్చారు.
ఎన్ని.. ఎందుకు?
- సొంతూర్లకు పంపించమని కోరుతూ ఫోన్ చేసినవే అత్యధికంగా.. 38వేలకుపైగా ఉన్నాయి. 25వేల వరకు కాల్స్ అన్నార్తుల నుంచి వచ్చాయి.
- అత్యవసర పరిస్థితుల్లో రక్తదాతలెవరైనా ఉంటే పంపించమంటూ, ఔషధాలు, ఉచిత అంబులెన్స్‌ల కోసం 12వేల వరకొచ్చాయి.