కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధానిలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మూసాపేట్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి, మియాపూర్, లింగంపల్లి, మాదాపూర్, బేగంపేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులతో పాటు ప్రధాన కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్లపై రాకపోకలు సాగించే వాహనదారులను నిలిపి వేసి ఎక్కడకు వెళ్తున్నారు, ఎందుకు బయట తిరుగుతున్నారు వంటి వివరాలు అడిగి తెలుసుకుని, అత్యవసరమైన వారిని అనుమతించారు. మిగతా వారిని తిప్పి పంపించారు. జనతా కర్ఫ్యూలో భాగంగా రోజంతా ఇళ్లకు పరిమితమైన వాహనదారులు సాయంత్రం నుంచి ఒక్కొక్కరుగా రోడ్లపై తిరగడం కనిపించింది. ఈ నెల 31 వరకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.
పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన వాహనదారులు
రాత్రి సమయంలో కొన్ని పెట్రోల్ బంకులు తెరుచుకున్నాయి. అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. జీహెచ్‌ఎంసీ అధికారులు నగరంలో మొత్తం 19 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ కూడళ్లలో కెమికల్ స్ప్రే చల్లారు. ఈ నెల 31 వరకు ఇదే తరహాలో స్ప్రే చల్లుతామని అధికారులు తెలిపారు. కేవలం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మాత్రమే కాకుండా ప్రజలు కూడా స్వీయ నిర్బంధంలో ఉంటేనే కరోనా వైరస్‌కు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.
ఇవీ చూడండి: స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష: కేసీఆర్