గుండెల మీద ఎత్తుకుని పెంచిన పిల్లలే వారిని చూసేందుకు నిరాసక్తత చూపుతున్నారు. వేలుపట్టి నడిపించిన తల్లిదండ్రులను మాకొద్దని వదిలేస్తున్నారు. ఏళ్ల తరబడి ఎర్రగడ్డ ఆస్పత్రిలోనే వారి జీవితాలు మగ్గిపోతున్నాయి. అనుకోని కారణాలతో మానసిక పరిస్థితి బాగాలేని వారిని బంధువులు లేదా రోడ్డు మీద కనిపించిన వారు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చేరుస్తుంటారు. అయితే వారికి కేవలం కొంతకాలంలోనే రోగం నయమవుతుంది. మామూలు మనిషిగా మారుతారు. కానీ... వారిని తిరిగి తీసుకువెళ్లేందుకు మాత్రం ఎవరూ రావటం లేదు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగైనా తమ వారు రాక 130 మంది వరకు ఎర్రగడ్డలోనే మగ్గిపోతున్నారు. వచ్చి తమను తీసుకెళ్లండంటూ ఫోన్లు చేసినా... కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు.
రోగులను ఆస్పత్రిలో చేర్చుకునేప్పుడే ఇక్కడి వైద్యులు రోగి తరఫు వారి బంధువుల వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. అయితే కొందరు మాత్రం తప్పుడు సమాచారం ఇచ్చి వారిని వదిలించుకుంటున్నారు. మరి కొందరైతే ఏకంగా మరో రెండేళ్లు ఉంచండి, నాలుగేళ్లు ఉంచండని చెబుతుండటం గమనార్హం. ఎప్పుడు, ఎలా ఈ ఆస్పత్రికి వచ్చారో తెలియకపోయినా... తమ వారిని చూడాలన్న ఆశతో యాతన పడుతున్నారు ఇక్కడి అమాయకులు. తమ వారిని పిలిపించమని సహాయకులను వేడుకుంటున్నారు. ఇలా పురుషుల వార్డులో 80మంది, మహిళల వార్డులో 30 మందికి పైగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మానసిక సమస్యతో ఒక్కసారి ఆస్పత్రికి వస్తే... తిరిగి వారిని ఇంటికి తీసుకెళితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అన్న భయం, సమాజం ఏమంటుందో అన్న బెంగతో కొందరు తమ వారిని ఇంటికి తీసుకువెళ్లేందుకు సుముఖంగా లేరని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెబుతున్నారు.
వ్యాధి నయమైనా రోగులు ఏళ్ల తరబడి ఆస్పత్రిలోనే ఉండటం వల్ల మళ్లీ పాత స్థితికి వెళ్లే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. ఆ దిశగా ఆలోచించిన సర్కారు... ఇలాంటి వారికోసం రీహాబిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇందుకోసం కావాల్సిన వసతి సదుపాయాలను త్వరలోనే పరిశీలించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి: కర్ణాటకీయం: కూటమికి ఝలక్- ముంబయికి నాగరాజు