ప్రాజెక్టుల నిర్వహణ కోసం అధికారులు, సిబ్బంది వివరాలను వారం, పది రోజుల్లోగా అందించాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉప సంఘాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తెలిపాయి. కేంద్రం ప్రకటించిన గెజిట్ కార్యాచరణ అమలు కోసం రెండు బోర్డుల ఉప సంఘాలు విడివిడిగా హైదరాబాద్ జలసౌధలో సమావేశమయ్యాయి. రెండు రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజినీర్లు, జెన్కో అధికారులతో పాటు ఆయా బోర్డుల సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.
గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో బోర్డు ఉపసంఘం సమావేశమైంది. అనుమతుల్లేని ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతులు తెచ్చుకోవాలని సూచించారు. కేంద్రం ప్రకటించిన తేదీ అక్టోబర్ 14లోగా గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం సహకరించాలని రెండు రాష్ట్రాలను గోదావరి బోర్డు ఉపసంఘం కోరింది. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ప్రాజెక్టుల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వివరాలను పది రోజుల్లోగా అందించాలని కేఆర్ఎంబీ ఉపసంఘం తెలిపింది.
ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కు సంబంధించిన రూ.కోటికి పైగా విలువ ఉన్న కాంట్రాక్టులు, వాటి వివరాలు పది రోజుల్లోగా ఇవ్వాలని రెండు రాష్ట్రాలకు సూచించింది. అన్ని అంశాలు పూర్తయ్యాక సీఆర్పీఎఫ్ అంశంపై చర్చిద్దామని ఉపసంఘం కన్వీనర్ ఆర్కే పిళ్లై అన్నారు. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ బోర్డు పరిధిలోకి అవసరం లేదని ఏపీ అధికారులు అంటే.. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కూడా బోర్డు పరిధిలో ఉండాల్సిందేనని తెలంగాణ అధికారులు అన్నారు. బోర్డు పరిధిలో ఉండాలా.. వద్దా అన్న విషయమై అవసరమైతే తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని కేఆర్ఎంబీ ఉపసంఘం కన్వీనర్ పిళ్లై చెప్పారు. వచ్చే గురువారం మరోమారు ఉపసంఘం సమావేశమయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: Dgp Mahender Reddy : 'రాజు ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలకు తావులేదు'