Medigadda Barrage Damage Issue Update : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నీటిని పూర్తిగా ఖాళీ చేయడానికి అనుమతించాలని నీటిపారుదలశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కొంతమేర కుంగినపుడు నీటి నిల్వలను చాలావరకు దిగువకు వదిలేశారు. అన్నారం, సుందిళ్లలోనూ కొంతమేరకు దిగువకు విడుదల చేశారు.
యాసంగిలో తాగునీటికి, ఇతరత్రా అవసరాల కోసం ఈ కొద్దిపాటి నిల్వలు ఉంచినట్లు తెలుస్తోంది. అనంతరం జాతీయ డ్యాం భద్రతాధికారులు మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్లను పరిశీలించారు. దీనిపై నవంబరు 4న లేఖ రాస్తూ మేడిగడ్డ బ్యారేజీలో వెంటనే నీటిని ఖాళీ చేసి బ్లాక్ కుంగిపోవడానికి, పియర్స్ దెబ్బతినడానికి కారణాలను పరిశోధించాలని సూచించారు.
Kaleshwaram Project Latest News : నీటిని నిల్వ చేస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్నారం, సుందిళ్లలోనూ మేడిగడ్డ లాంటి సమస్యలు రావచ్చని, వాటిల్లోనూ నీటిని ఖాళీ చేయాలని పేర్కొన్నారు. అన్నారం బ్యారేజీని సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం కూడా నవంబరు 14న తమ పరిశీలనలో తేలిన అంశాలను పేర్కొంటూ నీటిని ఖాళీ చేయించాలని సూచించింది.
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై పర్యావరణ నిపుణుల హెచ్చరిక
బ్యారేజీ కుంగిన వెంటనే నీటి నిల్వను తగ్గించిన ఇంజినీర్లు తర్వాత మళ్లీ కొంత మట్టం పెంచినట్లు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ సూచన నేపథ్యంలో కుంగుబాటుపై పరిశోధన చేయడానికి నీటిని పూర్తిగా ఖాళీ చేయాలని కోరుతూ డిసెంబరు 2న ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
కానీ, అంతకు రెండు రోజుల ముందే నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవీ విరమణ పొందడం, ప్రభుత్వం మారడం, అదనపు బాధ్యతలు అప్పగించిన అధికారి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం, కొత్త కార్యదర్శిని ప్రభుత్వం ఇంకా నియమించని క్రమంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం రాలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మేడిగడ్డలో 100 మీటర్ల పూర్తిస్థాయి మట్టానికి గాను 89.10 మీటర్లు, అన్నారంలో 119 మీటర్లకు గాను 113.77 మీటర్లు, సుందిళ్లలో 130 మీటర్లకు గాను 123.91 మీటర్ల మట్టం ఉంది. అన్నారం, సుందిళ్లలో రెండేసి టీఎంసీల నీటి నిల్వ ఉంది.
మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తాం : రేవంత్‌రెడ్డి
మరోవైపు రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీ ఛైర్మన్‌గా ఉన్న కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ ఏ.బీ. పాండ్యా 3 బ్యారేజీలనూ ప్రతిష్ఠాత్మకమైన సంస్థలతో అధ్యయనం చేయించాలని సూచించినట్లు సమాచారం. బ్యారేజీలకు వచ్చిన సమస్యలు చాలా తీవ్రమైనవని, లోతుగా పరిశోధన చేసి శాశ్వత చర్యలు తీసుకోవాల్సి ఉన్నందున స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ లాంటి సంస్థలను భాగస్వాములుగా చేయాలని సూచించినట్లు తెలిసింది. ఇవే అంశాలపై నిన్న ఆయన హైదరాబాద్‌లో నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశమై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారకులను వదిలిపెట్టేదేలే : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి వివరాలు అందించాలి : సీఎం రేవంత్ రెడ్డి