Mediation Techniques Awareness in Hyderabad: న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై అవగాహన అవసరమని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతివనంలో.. 'మధ్యవర్తిత్వంలో మెళకువలు' అనే అంశంపై హైకోర్టు న్యాయమూర్తులకు.. మూడు రోజుల అవగాహనలో పాల్గొన్నారు. న్యాయమూర్తిగా కేసులను చట్టప్రకారం తేలుస్తాం కానీ.. మధ్యవర్తిత్వంలో ఇరుపక్షాలకు ఆమోదయోగ్య పరిష్కారం సూచించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సదస్సులో పాల్గొన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, పలువురు నిపుణులు మధ్యవర్తిత్వం ప్రాధాన్యతను వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 10.80 లక్షల కేసులు పెండింగ్: ఏదైనా వివాదంలో ఇరుపక్షాలు స్వచ్ఛందంగా అంగీకరించి, పరిష్కరించుకునేందుకు ముందుకొస్తేనే నిర్వహించాల్సిన ప్రక్రియ మధ్యవర్తిత్వమని జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ఇలా మీడియేషన్ నిర్వహించడానికి మధ్యవర్తికి మెలకువలు అవసరమని స్పష్టం చేశారు. మధ్యవర్తికి సహనంతో వినే కళ ఉండాలన్నారు. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉద్వేగపూరితమైన ముగింపునిచ్చి, బంధాలను పెంచితే విజయవంతమైన మధ్యవర్తిగా నిలుస్తారని చెప్పారు. న్యాయమూర్తులకూ మధ్యవర్తిత్వంపై అవగాహన, సరైన శిక్షణ, మెలకువలు అవసరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హైకోర్టు, కింది కోర్టుల్లో 10.80 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇలాంటిచోట 10 నుంచి 20 ఏళ్లపాటు కేసుల పరిష్కారం కోసం ఎదురుచూస్తూ మనశ్శాంతిని కోల్పోవాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు.
"నేను అర్థం చేసుకున్న సమస్య ఏంటంటే.. దిల్లీ, బెంగళూరు మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో శిక్షణ పొందిన మధ్యవర్తులు లేరు. శిక్షణ పొందిన మధ్యవర్తులు లేకపోవడం తీవ్రమైన సమస్యగా కనిపిస్తోంది. ఇప్పుడు మీరు మధ్యవర్తిత్వంలో శిక్షణ, మెలకువలు పొందకపోతే మంచి మధ్యవర్తి కాలేరు." - జస్టిస్ లావు నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
పరిమితికి మించితే.. ఏ వ్యవస్థకైనా భారమే: వ్యవస్థ గురించి అర్థం చేసుకోకుండా కేసుల పెండెన్సీ గురించి కొందరు చెబుతుంటారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. పరిమితి మించితే ఏ వ్యవస్థకైనా అది భారమేనని అభిప్రాయపడ్డారు. కోర్టు కేసులతో పోల్చితే ప్రత్యామ్నాయ వివాద పరిష్కారవిధానం ప్రత్యేకమైనదన్నారు. చట్టప్రకారం తేల్చేవాటిలో అప్పీళ్లుంటాయని, అయితే మధ్యవర్తిత్వంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాల్సి ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్న సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఛైర్మన్ జార్జి లిమ్.. మధ్యవర్తిత్వం ద్వారా బిలియన్ డాలర్ల వివాదాన్ని రోజుల్లో పరిష్కరించినట్లు గుర్తుచేశారు.
"వ్యవస్థలో మార్పులను పట్టించుకోకుండా కొందరు కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్నాయని అంటుంటారు. ప్రతి వ్యవస్థకు ఒక పరిమితి ఉంటుంది. ప్రతి వ్యక్తి తన శక్తిమేరకు పని చేయగలడు. దానికి మించినప్పుడు అది భారంగా మారుతుంది. మన న్యాయ వ్యవస్థ దాని గరిష్ఠ సామర్థ్యంతో పనిచేస్తోంది. ప్రజల్ని కోర్టులకు రాకుండా నివారించలేం. కాబట్టే అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నాం. ఇలాంటి వాటిలో మధ్యవర్తిత్వం చాలా ప్రయోజనకరమైనది." - జస్టిస్ ఉజ్జల్ భుయాన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఇవీ చదవండి: