కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని ఆలయాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా చర్యలు తీసుకోవాలని సూచించారు. దర్శనం కోసం వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు పకడ్బందీ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి.. మైక్‌ల ద్వారా అనౌన్స్మెంట్ చేయాలని సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సర్క్యులర్ జారీ చేశారు. క్యూలైన్లు అన్నింటిలోనూ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వారి ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. గత 28 రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులను దర్శనానికి రావద్దని స్పష్టం చేశారు.